Mon Dec 23 2024 13:36:11 GMT+0000 (Coordinated Universal Time)
బేబీ మూవీలో మంచే చూపించాం.. డ్రగ్స్ ఇష్యూ పై దర్శకుడు..
మాదాపూర్ డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. బేబీ మూవీ గురించి మాట్లాడి, ఆ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా..
ఇటీవల హైదరాబాద్ లోని మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ నగరంలో సంచలనం సృష్టించింది. పక్కా సమాచారంతో స్థానిక పోలిసుల సహాయంతో దాడి చేసిన నార్కోటిక్ డిపార్ట్మెంట్.. పలువురిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయంలో ఎవరెవరు ఉన్నారు అనేదాని పై విచారణ జరుపుతున్నారు. ఇక ఈ కేసుకి సంబంధించిన వివరాలను మీడియాకి తెలియజేసే సమయంలో హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. రీసెంట్ సూపర్ హిట్ సినిమా బేబీ (Baby) గురించి మాట్లాడి, ఆ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమాలో డ్రగ్స్ ఎలా ఉపయోగించాలి అనే దానిని చాలా చక్కగా చూపించారని.. మాదాపూర్ లో జరిగిన సన్నివేశాలకు బేబీ మూవీ సీన్స్ కి పెద్ద తేడా ఏమి లేదని పేర్కొన్నారు. అలాగే స్క్రీన్ పై ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఆ సీన్స్ చూపించినందుకు దర్శకనిర్మాతలకు నోటీసులు కూడా పంపించనున్నట్లు వెల్లడించాడు. అలాగే సినిమాల్లో ఇలాంటి సీన్స్ తీయకండి అంటూ టాలీవుడ్ మేకర్స్ ని కోరారు.
ఇక కమిషనర్ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ పూర్తి అవ్వగానే.. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత SKN ఆఫీస్ కి వచ్చి కమిషనర్ ని కలుసుకున్నారు. ప్రెస్ మీట్ లో చూపించిన వీడియో యూట్యూబ్ కి సంబంధించిందని, దానికి వారికీ ఎటువంటి సంబంధం లేదని బేబీ నిర్మాత SKN తెలియజేశాడు. సినిమాలో ఆ సీన్ సమయంలో హెచ్చరిక వేసినట్లు వెల్లడించాడు.
సీవీ ఆనంద్ కూడా మూవీ టీంతో మాట్లాడుతూ.. మేము మీకు వ్యతిరేకం కాదు. సినిమాలో కొన్ని జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే మేము హెచ్చరిస్తున్నాము అంటూ పేర్కొన్నారు. ఇక దర్శకుడు సాయి రాజేష్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాలో మంచే చూపించమని, డ్రగ్స్ వాడకూడదనే ఆలోచననే మూవీలో చూపించినట్లు పేర్కొన్నాడు. కానీ దాని వెనుక ఉన్న మంచి వదిలేసి చెడుని గమనిస్తే తాము ఏమి చేయలేమని చెప్పుకొచ్చాడు. కాగా బేబీ టీంకి పోలీసులు అడ్వైజరీ నోటీస్ ని ఇచ్చారు.
Next Story