Sun Dec 22 2024 22:50:24 GMT+0000 (Coordinated Universal Time)
"బలగం" కథ వివాదం.. ఇంతకీ ఆ స్టోరీ ఎవరిది ?
సాంప్రదాయాలు మన అందరివీ. దీని మీద ఎవరైనా రాసుకోవచ్చు. ఇలాంటి కథల మీద ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి.
జబర్దస్త్ తో స్టార్ కమెడియన్ గా పేరొందిన వేణు అలియాస్ టిల్లు దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతూ తెరకెక్కించిన సినిమా "బలగం". ప్రియదర్శి, కావ్య జంటగా నటించిన ఈ సినిమా మార్చి 3న విడుదలై.. మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మించింది. ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా మంత్రి కేటీఆర్ నే గెస్ట్ గా ఆహ్వానించి.. అందరినీ తమవైపుకు తిప్పుకున్నారు.
తాజాగా "బలగం" కథపై ఓ వివాదం మొదలైంది. ఆ సినిమా కథ తనదని, 2011లోనే తాను ఆ కథ రాసుకున్నానంటూ.. ఓ దినపత్రికలో పనిచేస్తున్న గడ్డం సతీష్ అనే విలేకరి ప్రెస్ మీట్ పెట్టి మరీ స్టేట్ మెంట్ ఇచ్చాడు. 2014లో పచ్చికి అనే పేరుతో ఓ దినపత్రికలో కథ ప్రింట్ అయిందంటూ ప్రూఫ్ కూడా చూపించాడు. సినిమాలో ఈ కథ తనదే అని పేరు వేయకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని గడ్డం సతీష్ తెలిపాడు.
ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ "బలగం" దర్శకుడు వేణు మీడియా ముందుకి వచ్చి వివరణ ఇచ్చాడు. "నా కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఈ కథ ఆలోచన నాకు వచ్చింది. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్, నేను.. ముందు నుంచే మంచి స్నేహితులం. అతనికి నేను మొదట అనుకున్న నాలుగు సీన్ లు మాత్రమే చెప్పాను. అది విన్న అనుదీప్ చాలా బాగుంది, దీనిని తప్పకుండా తెరకెక్కించాలని అన్నాడు. ఈ కథను పూర్తిస్థాయిలో పూర్తి చేసేందుకు అనుదీప్ చాలా సహాయం చేశాడు. సుమారుగా 10 పల్లెటూళ్లలో తిరిగి అక్కడున్న పెద్ద మనుషులతో మాట్లాడి కథ రాసుకున్నాం. అనుదీప్ కూడా అందుకు ఎంతో రీసెర్చ్ చేశాడు."
"ఇంట్లో పెద్దలు చనిపోవడం, వారి పిండాలను పిట్టలు ముట్టకపోవడం అందరి ఇళ్లలోనూ జరిగే సాంప్రదాయం. ఇది ఎవరి కథ కాదు. సాంప్రదాయాలు మన అందరివీ. దీని మీద ఎవరైనా రాసుకోవచ్చు. ఇలాంటి కథల మీద ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి. కానీ వారెవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో కూడా చాలా సినిమాలు వస్తాయి. నేను కూడా మాట్లాడాను. ఎందుకంటే దీని మీద ఎవరైనా సినిమా తీయొచ్చు. ఇది మన సాంప్రదాయం. మీకు అంతగా ఉంటే రైటర్స్ అసోసియేషన్ కి వెళ్లి మాట్లాడమనండి. కావాలంటే వాళ్ళే చెప్తారు రెండు కథలను చూసి. చిల్లర పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది." అన్నాడు వేణు. మరి వేణు ఇచ్చిన వివరణపై సతీష్ ఎలా స్పందిస్తాడో, ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.
Next Story