Mon Jan 06 2025 06:01:34 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ పై ప్రధానికి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ
సినిమా స్క్రీన్ ప్లే, డైలాగ్ లు.. రాముడు, హనుమంతుల వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని లేఖలో పేర్కొంది.
ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా.. సన్నీసింగ్ శేషు పాత్రల్లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై.. ఆది నుండీ వివాదాలున్నాయి. ఇప్పుడీ వివాదాలు మరింత ముదురుతున్నాయి. కలెక్షన్ల పరంగా ఆదిపురుష్ దూసుకెళ్తున్నా.. సినిమాలో చూపించిన కథపై వివాదం ఇంకా సద్దుమణగలేదు. నెగిటివ్ ట్రోల్స్ పై ఇటీవల స్పందించిన ఓం రౌత్.. తాను తీసింది రామాయణం కాదని, యుద్ధకాండను తీసుకుని దానినే తెరపై చూపించానని చెప్పడం గమనార్హం. అలాంటపుడు రామాయణం చూపిస్తున్నామని ప్రచారం ఎందుకు చేశారని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు.. ప్రేక్షకులు కూడా మండిపడుతున్నారు. ఈ చిత్ర ప్రదర్శనలు ఆపివేయాలన్న డిమాండ్ లు కూడా పెరుగుతున్నాయి.
తాజాగా ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీకి.. ఆదిపురుష్ సినిమా ప్రదర్శనలను బ్యాన్ చేయాలని కోరుతూ లేఖ రాసింది. సినిమా స్క్రీన్ ప్లే, డైలాగ్ లు.. రాముడు, హనుమంతుల వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని లేఖలో పేర్కొంది. థియేటర్లలోనే కాదు.. ఓటీటీలో కూడా ప్రదర్శితం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. రాముడిని అందరూ దేవుడిలా కొలుస్తారు.. కానీ ఈ సినిమా పాత్రలు చెప్పిన డైలాగ్ లు, వేషధారణ.. హిందువుల మనోభావాలను, సనాతన ధర్మాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. రాముడిపై, రామాయణంపై ప్రజలకు ఉన్న భక్తిని, నమ్మకాన్ని ఆదిపురుష్ పోగొట్టేవిధంగా ఉందని తెలిపింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతాసిర్ శుక్లా, నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధానిని లేఖలో కోరింది.
Next Story