Mon Dec 23 2024 12:13:21 GMT+0000 (Coordinated Universal Time)
త్రీ ఇడియట్స్ నటుడు అఖిల్ మిశ్రా మృతి..
బాలీవుడ్ ప్రముఖ నటుడు అఖిల్ మిశ్రా 58 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు అఖిల్ మిశ్రా (Akhil Mishra) కన్నుమూశారు. 58 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచి ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. కాగా ఆయన మృతి గల కారణాలు పై భిన్నమైన సమాచారాలు వస్తున్నాయి. కొన్ని రిపోర్టులు ప్రకారం ఆయన కిచెన్ లో పని చేస్తున్న సమయంలో కాలుజారి పడడంతో తలకి బలమైన గాయం అయ్యి మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక మరికొన్ని రిపోర్టులు ప్రకారం ఆయన బాల్కనీ నుంచి పడి మరణించినట్లు సమాచారం.
కుటుంబసభ్యుల నుంచి అధికారిక ప్రకటన వస్తే గాని ఈ మరణవార్త పై ఒక క్లారిటీ ఉండదు. కాగా ఈ ప్రమాదం జరిగినప్పుడు అఖిల్ మిశ్రా భార్య 'సుస్సానే' కూడా హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నారని, ఈ విషయం తెలుసుకున్న ఆమె వెంటనే ముంబై బయలుదేరినట్లు సమాచారం. అఖిల్ మిశ్రాకి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య 1997 లో మరణించడంతో 2009 లో జర్మన్ యాక్ట్రెస్ 'సుస్సానే'ని చేసుకున్నారు.
అఖిల్ మిశ్రా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ '3 ఇడియట్స్' సినిమాలో లైబ్రేరియన్ దూబే పాత్రలో నటించి మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించి ఆ పాత్రలకు ప్రాణం పోశారు. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటించారు. ఇక అఖిల్ మిశ్రా అకాలమరణంతో బాలీవుడ్ అంతా షాక్ కి గురైంది. సోషల్ మీడియా ద్వారా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ వస్తున్నారు.
Next Story