Mon Dec 23 2024 11:19:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రో మూవీ రివ్యూ
అతను తన తల్లి, చెల్లెళ్ళతో హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటాడు. డబ్బు-పని తప్ప మరో ధ్యాస ఉండదు. తన సమయాన్ని..
చిత్రం: బ్రో
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
తారాగణం: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి తదితరులు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం: ఎస్ థమన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైన్: ఎ.ఎస్. ప్రకాష్
నిర్మాత: టి జి విశ్వ ప్రసాద్
దర్శకత్వం: సముద్రఖని
విడుదల తేదీ: జూలై 28, 2023
పవన్ కళ్యాణ్ సినిమా అంటే హంగామా మామూలుగా ఉండదు. అది కూడా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్నాడని తెలియగానే సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అసలే తమిళంలో హిట్ అయిన సినిమా.. త్రివిక్రమ్ మాటలు అందించడం కూడా ప్లస్ కావడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కడం ఖాయం. ఇక ఈరోజు సినిమా విడుదలైంది. ఎలా ఉందో మనం కూడా ఓ లుక్ వేసుకుందాం.
కథ :
మార్కండేయ (సినిమాలో మార్క్ అనే పిలుస్తూ ఉంటారు) (సాయి ధరమ్ తేజ్) ఇద్దరు చెల్లెల్లు, ఒక తమ్ముడు ఉంటారు. కుటుంబంలో పెద్దవాడు. అతను తన తల్లి, చెల్లెళ్ళతో హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటాడు. డబ్బు-పని తప్ప మరో ధ్యాస ఉండదు. తన సమయాన్ని ఎవరికీ ఇవ్వడు, తన ప్రియురాలు రమ్య (కేతిక శర్మ)ను కూడా పెద్దగా పట్టించుకోడు. అలాంటి పరిస్థితుల్లో వైజాగ్ నుండి హైదరాబాద్ వస్తుండగా కారు ప్రమాదంలో చనిపోతాడు. కాలం అనే టైటాన్ (పవన్ కళ్యాణ్) ముందు వెళ్లి నిలుస్తాడు. తనకు చనిపోవాలని లేదని.. తనకు సమయం కావాలని.. కొద్దిరోజులు ఇస్తే అన్నీ సెట్ చేస్తా అని వేడుకుంటాడు. దీంతో టైటాన్.. మార్కండేయకు 90 రోజులు సమయం ఇస్తాడు. ఈ 90 రోజుల్లో టైటాన్.. మార్క్‌కి జీవితమంటే ఏమిటో చెప్తాడా ? టైటాన్ వల్ల మార్క్ కు ఏం తెలుస్తుంది ? బంధాల కంటే సమయం చాలా విలువైనదన్న మార్క్ అభిప్రాయం కరెక్టేనా ? అన్నది మిగిలిన కథ.
నటీనటులు ఎలా చేశారు
సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ కనిపించడం విశేషం. ఓ పవర్ ఉన్న పాత్రలో కనిపించి మరోసారి మెప్పిస్తాడు. పవన్ కళ్యాణ్ సందడి చేస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు సమాజానికి ఏమి కావాలో.. సమాజం కోసం మనం ఏమి చేయాలో బాగా చూపించాడు. ఇక మార్కండేయగా సాయి ధరమ్ తేజ్ ఆకట్టుకున్నాడు. కొన్ని కొన్ని సీన్లలో మునుపటి సాయి ధరమ్ తేజ్ ను చూడొచ్చు. సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ మధ్య సీన్లు బాగా నవ్వు తెప్పిస్తాయి. ఆలోచింపజేస్తాయి.. ఎమోషనల్ కూడా చేస్తాయి. సాయి ధరమ్ తేజ్ సోదరిగా ప్రియా ప్రకాష్ వారియర్ కనిపిస్తుంది. కేతిక శర్మ స్క్రీన్ టైమ్ తక్కువే. వెన్నెల కిషోర్, పృధ్వి, తనికెళ్ల భరణి వారి క్యారెక్టర్లలో పర్వాలేదనిపించారు.
ఎలా ఉందంటే
ఫస్ట్ హాప్ సినిమా చాలా ఫన్నీగా సాగిపోతుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. వింటేజ్ లుక్స్ ఇలా ఫ్యాన్స్ కు కావాల్సిన అన్నీ ఉంటాయి. చనిపోయిన తర్వాత, తన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఓ వ్యక్తికి వస్తే ఎలా ఉంటుంది.. అనేదే సినిమా కథ. తెలుగులో చాలా మార్పులు చేసారు. సాయి ధరమ్ తేజ్ కుటుంబం మరియు జీవితాన్ని, అలాగే ప్రమాదం, టైటాన్ ను కలవడం వంటి అంశాలతో సినిమా మొదటి సగం వేగంగా వెళ్ళిపోతుంది. చాలా వరకూ కామెడీతో పవన్ ఎంటర్టైన్ చేశారు. పవన్ కళ్యాణ్ తన పాపులర్ పాటల్లో కొన్నింటిని రీక్రియేట్ చేయడం కూడా బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత, సినిమా పూర్తిగా సీరియస్ నోట్ లోకి వెళ్ళిపోతుంది. కొన్ని సీన్లు ముందే ఊహించగలుగుతాం. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బార్ సంభాషణ బాగుంటుంది. సినిమా రన్ టైమ్ కూడా తక్కువే కావడంతో బోర్ కొట్టినట్లు అనిపించకపోవడం పెద్ద ప్లస్. ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుంది. మనం మన జీవితాన్ని జీవిస్తూ ఉంటే చాలు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ టూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని మనకు అర్థం అవుతుంది. సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా.. పాటలు మరీ అంత కిక్ ఇవ్వకపోవడం కొంచెం మైనస్. ఇక బ్రో థీమ్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమా టెక్నికల్ విలువలు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ స్టైలింగ్ లో రిచ్ నెస్ కనిపిస్తుంది. కానీ చాలా వరకూ గ్రీన్ మ్యాట్ షాట్స్ కొంచెం స్క్రీన్ మీద తేడా కొడతాయి.
చివరిగా..బ్రో మంచి మెసేజ్ ఇవ్వడమే కాకుండా.. పవన్ కళ్యాణ్ అభిమానులను, ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్
+ పవన్ కళ్యాణ్
+ బీజీఎం
+ ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్
- పాటలు
- ఎక్కడో చూసినట్లు అనిపించే సీన్లు
రేటింగ్: 2.75/5
Next Story