Sat Nov 23 2024 04:09:55 GMT+0000 (Coordinated Universal Time)
జల్లికట్టులో విషాదం.. యజమానినే హతమార్చిన వృషభం
పొంగల్ వేడుకలను పురస్కరించుకుని తమిళనాడులో జల్లికట్టు నిర్వహించడం అనాదిగా వస్తోన్న ఆచారంగా మారింది. అక్కడ పొంగల్ అంటే..
పొంగల్ వేడుకలను పురస్కరించుకుని తమిళనాడులో జల్లికట్టు నిర్వహించడం అనాదిగా వస్తోన్న ఆచారంగా మారింది. అక్కడ పొంగల్ అంటే.. గుర్తొచ్చేది జల్లికట్టే. ఏపీ - తమిళనాడు సరిహద్దు జిల్లా అయిన చిత్తూరులోనూ జల్లికట్టు కనిపిస్తుంటుంది. ఈ ఆట కాస్త సాహసోపేతమైనదే. బలిష్టమైన వృషభాల కొమ్ములకు బహుమతులు కట్టి బరిలోకి వదులుతారు. వాటిని తీసుకుని, వృషభాన్ని లొంగదీసేందుకు కొన్ని వందల మంది దాని వెంట పరిగెడుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. అలాంటి సంఘటనలూ ఉన్నాయి.
తాజాగా తిరుచ్చి సమీపంలోని ఓ గ్రామంలో అలాంటి విషాద ఘటనే జరిగింది. సురియూర్ గ్రామంలో నిర్వహించిన జల్లికట్టులో ఓ ఎద్దు సొంత యజమానినే చంపేసింది. శ్రీరంగంకు చెందిన మీనాక్షి సుందరం అనే వ్యక్తి తన ఎద్దును జల్లికట్టుకోసమని సురియూర్ గ్రామానికి తీసుకొచ్చాడు. ఆ వృషభానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జల్లికట్టు బరి వద్దకు తీసుకెళుతుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ ఎద్దు ఒక్కసారిగా కొమ్ములు విసరడంతో మీనాక్షి సుందరానికి తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో మీనాక్షి సుందరం చనిపోయాడు.
Next Story