Mon Dec 23 2024 11:44:29 GMT+0000 (Coordinated Universal Time)
సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదు : చిరంజీవి ఆవేదన
కరోనా సమయంలో తమ దృష్టికి వచ్చిన సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలను అందించిన విషయం గుర్తు చేసిన చిరంజీవి..
హైదరాబాద్ : సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదంటూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మేడే సందర్భంగా హైదరాబాద్ యూసుఫ్ గూడ కేవీఆర్ మైదానంలో సినీ కార్మికోత్సవాన్ని నిర్వహించారు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మంత్రులు తలసాని, మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినీ కార్మికులు ఎన్నో బాధలను దిగమింగి పనిచేస్తారని, కానీ వారి జీవితాలకు భరోసా లేదని ఆవేదన చెందారు.
కరోనా సమయంలో తమ దృష్టికి వచ్చిన సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలను అందించిన విషయం గుర్తు చేసిన చిరంజీవి.. సీసీసీ ద్వారా కార్మికులకు తనవంతు సహాయం చేయడం బాధ్యతగా భావించినట్లు తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాల సహకారం కావాలని చిరంజీవి ఈ సందర్భంగా కోరారు. అలాగే సినీ కార్మికులంతా రాజకీయాలకు అతీతంగా కలిసుండాలని పిలుపునిచ్చారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సంక్షోభం కారణంగా సినీ, పర్యాటక రంగాలు చాలా నష్టపోయాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వచ్చాక.. ఇప్పుడిప్పుడే ఈ రెండు రంగాలు కాస్త కోలుకుంటున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉందని కిషన్ రెడ్డి కొనియాడారు. దేశంలో 45 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉంటే.. 5 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారని, వారికి మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు కూడా లబ్ధి చేకూరేలా ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ-శ్రమ్ కార్డుల ద్వారా కార్మికులు ప్రయోజనాలు పొందవచ్చన్న మంత్రి.. ఇప్పటికే 28 కోట్ల ఈ-శ్రమ్ కార్డులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను చిరంజీవికి అభిమానిని కానీ.. ఆయనంత ఫేమస్ కాదని తన భావాన్ని వ్యక్తం చేశారు. "నువ్వు కేంద్రమంత్రివి కూడా అయ్యావు అన్నా. మీ ఫ్యామిలీ అంతా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారన్నా. మొత్తం ఫిలిం ఇండస్ట్రీనంతా దున్నేస్తున్నావన్నా నువ్వు! నువ్వు అన్నీ సాధించావన్నా! కరోనా సంక్షోభ సమయంలో కార్మికుల కోసం కోట్ల రూపాయలు ఇచ్చావు... వాళ్లను ఆదుకున్నావు. కష్టకాలంలో కార్మికుల కోసం నిలబడింది నువ్వొక్కడివే అన్నా. నాదొక రిక్వెస్ట్ అన్నా... ఇకపై కార్మికుల కోసం సినిమాలు, ఓటీటీ కంటెట్ తీయాలన్నా. ఓటీటీ కంటెంట్ లో కార్మికులను కూడా భాగస్వాములను చేసి, వాళ్లకు కూడా షేర్ ఇస్తే వాళ్లు గొప్పవాళ్లయిపోతారన్నా!" అంటూ తన మనసులోని భావాలను చిరంజీవికి తెలియజేశారు.
Next Story