Sat Nov 23 2024 00:43:09 GMT+0000 (Coordinated Universal Time)
ఇక్కడ వారు లేదు కదా అని అన్న చిరంజీవి.. ఆయనే టార్గెటా..?
మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కొద్దిరోజుల కిందట సభాముఖంగా చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే..! అభిమానులు ఎవరో వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉంటే.. మెగాస్టార్ చిరంజీవిని గరికపాటి మీరు ఆపాలి ఫోటో సెషన్ లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని హెచ్చరించారు. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని అలా అంటారా అని ఎంతో మంది గరికపాటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి అభిమానులు క్షమాపణలు చెప్పాలని గరికపాటిని డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై చిరంజీవి డైరెక్ట్ గా మాట్లాడలేదు. అయితే తాజాగా మాత్రం ఓ చిన్న డైలాగ్ తో ఆయన్ను టార్గెట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు రచించిన 'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడిన అనంతరం ఆయనతో ఫొటోలు దిగడానికి కొంత మంది మహిళలు స్టేజి మీదికి వెళ్లారు. వారందరినీ చూసిన మెగాస్టార్ చిరంజీవి 'ఇక్కడ వారు లేరు కదా' అంటూ వేలు పైకి చూపిస్తూ చెప్పడంతో అక్కడ నవ్వులు చిగురించాయి. గరికపాటి నరసింహారావును పరోక్షంగా గుర్తుచేసుకున్నారని.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ వస్తోంది.
ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. 'శూన్యం నుండి శిఖరాగ్రాలకు' లాంటి పుస్తకాలు భావితరాలకు ఎంతో అవసరమని అన్నారు. ప్రస్తుత తరానికి ముందు తరం సినిమా దిగ్గజాల గురించి తెలియడం లేదని బాధను వ్యక్తం చేశారు. అందుకు తానే ఉదాహరణ అని అన్నారు. తన ఇంట్లో ఉన్న ఎనిమిదేళ్లు, తొమ్మిదేళ్లు, ఐదేళ్ల మనవరాళ్లు ఎంతసేపటికి రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్, తేజు, వైష్ణవ్లనే హీరోలుగా ఫీలవుతూ ఉంటారని.. వాళ్ల పాటలే చూస్తున్నారని చిరంజీవి అన్నారు. దీంతో తనకు ఎక్కడో కడుపు మండిపోతుండేదని.. అందుకే, తన గురించి తానే పిల్లల దగ్గర చెప్పుకున్నానని చిరంజీవి అన్నారు. తన పాటలను పిల్లలకు వేసి చూపించి తన గురించి తాను చెప్పుకున్నానని.. ఆ తరవాత పిల్లలు తెలుసుకుని తన గాడ్ ఫాదర్ సినిమా నాలుగు సార్లు చూశారని అన్నారు. తనను తాను నిరూపించుకోవడానికి చిన్న పిల్లల దగ్గర సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చిందని చిరంజీవి అన్నారు.
Next Story