Fri Nov 22 2024 19:32:12 GMT+0000 (Coordinated Universal Time)
బాధను బయట పెట్టిన చిరంజీవి
అప్పట్లో ''రుద్రవీణ' సినిమాకు జాతీయ అవార్డు వచ్చిందని ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లాం.. అవార్డు వేడుక ముందు ఓ ఫంక్షన్..
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' ప్రీ రిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్ లో కన్నుల పండుగలా సాగింది. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. శనివారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ గతంలో తెలుగు సినిమాకు జరిగిన అవమానాల గురించి మరోసారి చెప్పుకొచ్చారు. అప్పట్లో ''రుద్రవీణ' సినిమాకు జాతీయ అవార్డు వచ్చిందని ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లాం.. అవార్డు వేడుక ముందు ఓ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. అక్కడ గోడపై ఇండియన్ సినిమా వైభవం పేరుతో పలు పోస్టర్లు ఉంచారు. పృథ్వీరాజ్‌కపూర్, దేవానంద్, అమితాబ్, దిలీప్‌కుమార్ ఇలా ప్రతి ఒక్కరినీ చూపించారు.
దక్షిణాదికి వచ్చేసరికి ఎంజీఆర్–జయలలిత డ్యాన్స్ చేస్తున్న ఫొటో వేసి సౌత్ సినిమా అని రాశారు. ప్రేమ్ నజీర్‌గారి ఫొటో ఒకటి కనిపించింది. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, విష్ణు వర్థన్, తెలుగులో ఎన్టీఆర్, ఏయన్నార్.. మన దక్షిణాదికి చెందిన మహామహుల ఫొటో ఒక్కటీ కనిపించలేదు. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాగా అక్కడ చూపించారు. చాలా బాధ అనిపించింది. దానికి సరైన సమాధానం ఈ మధ్యకాలం వరకూ దొరకలేదు.
తెలుగు సినిమా హద్దులు చెరిపేసి, ఇండియన్ సినిమా అని గర్వపడేలా 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'లు వచ్చాయి. మన సినిమా స్థాయిలు ప్రపంచానికి తెలియజేశాయి. ఆ చిత్రాల రూపకర్త దర్శకుడు రాజమౌళి మన పరిశ్రమలో ఉండడం గర్వకారణం. రాజమౌళి వేసిన దారి వల్ల ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీ స్థాయికి వెళ్తుంది. కథలో బలం ఉంటే, స్టార్స్ ఏ ప్రాంతం వాళ్లైన పాన్ ఇండియా నటులు, దర్శకులే అవుతారు. గతంలో మణిరత్నం, ఆ తర్వాత శంకర్ తమిళ సినిమా గర్వపడే చిత్రాలు చేశారని చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. కేజీఎఫ్ సినిమా తీసిన ప్రశాంత్ నీల్ పై కూడా చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.
Next Story