Sun Dec 22 2024 19:52:01 GMT+0000 (Coordinated Universal Time)
చిన్ననాటి స్నేహితుడికి దగ్గరుండి వైద్యం చేయిస్తున్న చిరు..
తన చిన్ననాటి స్నేహితుడు కోసం చిరు స్వయంగా వచ్చి.. దగ్గరుండి వైద్యం చేయిస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి కేవలం తన సినిమాలతోనే కాదు తన వ్యక్తిత్వంతోను ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తనని హీరో చేసిన అభిమానుల కోసం, తన మంచి కోరుకునే శ్రేయోభిలాషులు, మిత్రులు కోసం తను ఎప్పుడూ తోడుగా నిలుస్తుంటాడు. తాజాగా తన చిన్ననాటి స్నేహితుడు కోసం చిరు స్వయంగా వచ్చి.. దగ్గరుండి వైద్యం చేయిస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
చిన్నతనంలో మొగల్తూరులో తనతో పాటు చదువుకున్న, ఆడుకున్న మిత్రుడు 'పువ్వాడ రాజా'.. అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకున్న చిరు అతనిని వెంటనే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి తరలించాడు. అక్కడి వైద్యుల చేత మిత్రుడికి అవసరమైన వైద్యం అందజేయిస్తున్నాడు. ఇక తాజాగా చిరంజీవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుడిని పరామర్శించేందుకు వచ్చాడు. స్నేహితుడితో మాట్లాడి అతనికి ధైర్యం చెప్పాడు చిరు.
అలాగే డాక్టర్స్ తో మాట్లాడి మిత్రుడి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలుసుకున్నాడు. ఇక మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి.. చిన్ననాటి స్నేహితుడిని ఇంకా గుర్తు పెట్టుకొని, అతని కోసం ఇలా ముందుకు రావడం ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చిరంజీవి పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇక చిరు నటించబోయే Mega157 సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న వశిష్ట ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి. సోషియో ఫాంటసీ డ్రామాతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో చిరు.. తన ఏజ్ కి తగ్గ పాత్రని పోషిస్తున్నట్లు దర్శకుడు తెలియజేశాడు.
Next Story