క్రిస్మస్ హీరో ఎవరవుతారో..?
దసరా వచ్చింది.. వెళ్లింది. దసరాకి వచ్చిన మూడు సినిమాలు యావరేజ్ హిట్స్ తో సరిపెట్టుకున్నప్పటికీ.. దసరా సెలవుల వలన మూడు సినిమాలు ఒడ్డెక్కేశాయి. అరవింద సమేత వీర రాఘవ సినిమా కూడా రెండు వారాల కలెక్షన్స్ బాగుండడంతో బ్రేక్ ఈవెన్ కి చేరుకునేలా కనబడడం, హలో గురు ప్రేమకోసమే, పందెం కోడి 2 సినిమాలు కూడా యావరేజ్ టాక్ తో పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చేస్తున్నాయి. ఇక దసరా తర్వాత మళ్లీ సంక్రాంతే అంత పెద్ద పండగ. కానీ మధ్యలో డిసెంబర్ చివరి వారం అంటే క్రిస్మస్ కూడా సినిమాల విడుదలకు మంచి టైం. క్రిస్మస్ పండగ ముందురోజు ఈవ్ సెలవు, 25న క్రిస్మస్ రోజు సెలవు, అలాగే ఆ తర్వాతి రోజు బాక్సిండ్ డే సెలవుతో సినిమాలకు బాగా ఉపయోగపడుతున్నాయి.
క్రిస్మస్ సెలవులే టార్గెట్ గా...
అందుకే దసరా తర్వాత నవంబర్ ని వదిలేసి డిసెంబర్ లో మళ్లీ సినిమాల సందడి మొదలవుతుంది. ఇక ఈ డిసెంబర్ చివరి లో శర్వానంద్ - సాయి పల్లవిల కలయికలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు 21న విడుదలకు సిద్ధమవుతుండగా... వరుణ్‌తేజ్ – సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ మూవీ అంతరిక్షం 9000 కెఎంపిహెచ్ మూవీ తో పాటు రాజకీయాలతో అత్యంత క్రేజీ మూవీగా తెరకెక్కుతున్న మమ్ముట్టి - మహి వి రాఘవ్ కాంబినేషన్ మూవీ యాత్ర కూడా డిసెంబర్ 21 న క్రిస్మస్ సెలవుల టార్గెట్ గానే బరిలోకి దిగుతున్నాయి.
బరిలో మూడు సినిమాలు...
ఇక ఈ మూడూ సినిమాలు డిఫరెంట్ కాన్సెప్టులతో తెరకెక్కినవే. శర్వానంద్ - సాయి పల్లవి సినిమా పూర్తి స్థాయి రొమాంటిక్ లవ్‌స్టోరి కాగా వరుణ్ తేజ్ ఏకంగా టాలీవుడ్లో ఇదివరకెన్నడూ ఎవరూ టచ్ చేయని కథాంశాన్ని ఎంచుకుని స్పేస్ బ్యాక్‌డ్రాప్ మూవీతో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. ఇక మూడో సినిమా వైయస్సార్ జీవితకథతో తెరకెక్కుతున్న యాత్ర అంతే ప్రత్యేకమైన చిత్రంగా పాపులరైంది. ఈ మూడు వేటికవే ప్రత్యేకం కాబట్టి క్రిస్మస్ బరిలో కాంపిటీషన్ బాగా టఫ్ గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ మూడు సినిమాలు కూడా క్రేజీ కాంబోలో కావడం... మూడు సినిమాలకు మంచి అంచనాలుండడంతో ఈ క్రిస్మస్ కూడా చాలా క్రేజీగా కనబడుతుంది. మరి మూడిట్లో క్రిస్మస్ హీరో ఎవరవుతారో గానీ ఇప్పటి నుండే ఈ సినిమాల హడావిడి మొదలెట్టేశాయి ఆయా చిత్ర బృందాలు.