అప్పుడు సెంటర్స్.. ఇప్పుడు ఫిగర్స్...!
ప్రతి శుక్రవారం సినిమా ప్రేమికులకు పండగే. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి ప్రతివారం కొత్త సినిమాలు వస్తుంటాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ హడావిడే వేరు. మొదటిరోజు, మొదటి షో చూసేయాలన్న ఆరాటం అభిమానులదైతే, మొదటి వారం వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్‌లో సినిమా వేసి కలెక్షన్లు కొల్లగొట్టెయ్యాలన్న ఆలోచన నిర్మాతలది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమా ఎన్ని థియేటర్స్‌లో 50 రోజులు ఆడింది...? ఎన్ని సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకుంది...? వంటి ఫిగర్స్ అభిమానుల మధ్య గొడవ రేపేది.
కలెక్షన్ ఫిగర్ మాత్రమే.....
ఇప్పుడు ట్రెండ్ మారిపోయి సెంటర్స్ స్థానంలో కలెక్షన్ ఫిగర్స్ వచ్చి చేరాయి. ఎప్పుడైతే 'బాహుబలి' సిరీస్ 2000 కోట్లు కలెక్ట్ చేసిందో అప్పటి నుంచి ఆ ఫిగర్స్ జోలికి వెళ్ళకుండా నాన్ బాహుబలి రికార్డ్ పేరుతో స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ ఎవరికి తోచింది వారు ప్రకటించేసుకుంటున్నారు. ఒకరు 100 కోట్లు వేశారని, మరొకరు 150 కోట్లు కలెక్ట్ చేసిందంటూ పేపర్ లెక్కలు చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ బెడద మరింత పెరిగింది. ఈమధ్య విడుదలైన ఓ స్టార్ హీరో సినిమా టాక్ పరంగా వీక్ అయినా కలెక్షన్స్ ఇరగదీసేస్తోందంటూ నిర్మాత ప్రకటించేసుకుంటున్నాడు. వచ్చిన కలెక్షన్‌కి రెండింతలు వేసుకొని యాడ్స్ ఇచ్చేస్తున్నారు.
త్వరలోనే 200 కోట్లు అంటూ.....
త్వరలోనే ఆ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసిందనే ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కంటెంట్‌ని పట్టించుకోకుండా కలెక్షన్పైనే దృష్టి పెడుతున్న ఇలాంటి నిర్మాతలు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఇకనైనా కాంబినేషన్‌ని పక్కన పెట్టి విషయం ఉన్న సినిమాలు తీస్తే నిర్మాతలకు మంచిది. జనం కూడా నిజంగా ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే విషయంలో ఒక క్లారిటీకి వస్తారు.