'సర్కార్’ వివాదంపై స్పందించిన మురుగదాస్..!
విజయ్ - మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ చిత్రం ‘సర్కార్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండే వివాదాస్పదమైంది. అందుకు కారణం అందులో విజయ్ సిగిరెట్ తాగుతూ కనిపించడం. ఇది ఇలా ఉండగా మరి కొన్నిరోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ఈ కథ నాదే అని.. 2007 లోనే నేను ఈ కథ రాసుకున్నానని..ఇప్పుడు దాన్ని ‘సర్కార్’గా తెరకెక్కించారని రచయిత వరుణ్ రాజేంద్రన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటువంటి వివాదాలు హీరో విజయ్ కి కొత్త ఏమి కాదు. తన గత సినిమా ‘మెర్సల్’ కూడా వివాదాల నడుమే ప్రేక్షకుల ముందుకొచ్చి తమిళంలో అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పుడు 'సర్కార్' విషయంలో మరో వివాదం నెలకొంది. అయితే దీనిపై డైరెక్టర్ మురగదాస్ స్పందిస్తూ...వరుణ్ పదేళ్ల కిందటే కథ రాసుకుని ఉండొచ్చు కానీ నేను ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చిత్రాన్ని తెరకెక్కించానని మురగదాస్ తెలిపారు.
ఇంతవరకు కలవనే లేదు...
అసలు వరుణ్ అనే వ్యక్తిని తన జీవిత కాలంలో కలవలేదని.. ఆయన 2007లో కథ రాసుకున్నారు. కానీ నా సినిమాను ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించాను. మా సినిమాలో జయలలిత మరణాన్ని కూడా చూపించాం. అలాంటపుడు 2007లో రాసుకున్న కథ.. ఈ కథ ఎలా ఒక్కటి అవుతుందని అన్నారు. ఆయన కథకు తన కథకు ఒకే పోలిక ఉంది. ఓట్లను ఎలా దుర్వినియోగం చేశారు..? అంతే తప్ప పూర్తిగా ఆయన కథను తీసుకుని సినిమా తీసాం అనడం సరికాదని అన్నారు. అయినా సినిమా చూడకుండా చాలా రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు. ఈ ఘటన నన్ను చాలా బాధించిందని మురుగదాస్ వాపోయారు. ఈ కథ కోసం నేను మా అసిస్టెంట్స్ ఎంతో కష్టపడ్డాం అని తెలిపారు.