Fri Nov 22 2024 19:24:19 GMT+0000 (Coordinated Universal Time)
అలా చెప్పకపోవడం వల్లే ఆదిపురుష్ టీజర్ పై ట్రోలింగ్ : ఆర్జీవీ
పొడవాటి జుట్టు, భారీ ఆకారం, గంభీరమైన చూపులతో రావణుడిగా ఎస్వీ రంగారావును చూడటానికి అలవాటుపడ్డానని..
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఆదిపురుష్. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ రాగా.. దానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవుళ్లు చెప్పులు వేసుకుని నడుస్తారా ? అంటూ ఫైరయ్యారు. అలాగే రావణ పాత్రధారి అయిన సైఫ్ అలీ ఖాన్ వేషధారణపై, హనుమంతుడి రూపురేఖలపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ఆదిపురుష్ టీజర్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ టీజర్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు ఆర్జీవీ. రామయణం అంటే ఇది అని, ఇలా ఉంటుందని, రాముడు, హనుమంతుడు, రావణుడు ఇలా ఉంటారని మనకు ఒక ఆలోచన ఉంటుందన్నారు. కానీ.. ఆదిపురుష్ లో ఆయా పాత్రల వేషధారణ మన ఆలోచనలు, ఊహకు భిన్నంగా ఉండటంతో భారీగా ట్రోలింగ్ జరుగుతోందన్నారు. నిజానికి రావణ పాత్రలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ లుక్ తనకు కూడా నచ్చలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
పొడవాటి జుట్టు, భారీ ఆకారం, గంభీరమైన చూపులతో రావణుడిగా ఎస్వీ రంగారావును చూడటానికి అలవాటుపడ్డానని, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజర్ లో సైఫ్ అలీ ఖాన్ ను చూశాక కొంచెం బాధగా అనిపించిందని, ఇదేంటి ఇలా ఉన్నాడు అనుకున్నానని వర్మ వివరించారు. ఓ నిర్మాత కూడా తనకు ఫోన్ చేసి 'ఆదిపురుష్' లో రాముడేంటి మీసాలతో ఉన్నాడు అని అడిగాడని తెలిపారు. రాముడిని మీసాలతో ఎందుకు చూపించకూడదన్నది చిత్రబృందం ఆలోచన అయి ఉంటుందని వర్మ అభిప్రాయపడ్డారు.
మనది ప్రజాస్వామ్య దేశం.. ఎవరు ఏదైనా చేయొచ్చని ఇప్పుడు 'ఆదిపురుష్' చిత్రాన్ని కూడా వాళ్లు తమకు నచ్చిన రీతిలో తీస్తున్నారని తెలిపారు. నచ్చినవాళ్లు చూస్తారు, నచ్చనివాళ్లు చూడరు. అంతే తప్ప, ట్రోలింగ్ చేయడం సరికాదని హితవు పలికారు. తాము రామాయణాన్ని విభిన్నరీతిలో చూపిస్తున్నామని 'ఆదిపురుష్' చిత్రబృందం ముందే ప్రకటించి ఉంటే బాగుండేదని, అలా చెప్పకపోవడం వల్లే టీజర్ చూశాక ఈ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. అదొక యానిమేటెడ్ ఫిల్మ్ లా అనిపించడంతో పాటు పాత్రల్లో ఎక్కడా సహజత్వం కనిపించలేదన్నారు.
Next Story