ఇద్దరు వంశీల కథలూ కొత్తవాళ్లకోసమేనా..?
తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు వంశీలు ఉన్నారు. ఒకరు చిన్న వంశీ, మరొకరు పెద్ద వంశీ. చిన్న వంశీ అంటే కృష్ణవంశీ. పెద్ద వంశీ అంటే 'లేడీస్ టైలర్' వంశీ. ట్రెండ్ సెట్టర్లుగా నిలిచిన ఈ ఇద్దరూ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈమధ్య వీళ్లు తీసిన ఏ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. దాంతో కమ్‌బ్యాక్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ మరో హిట్టు కోసం తాము రాసుకొన్న కథనే నమ్ముకొన్నట్టు తెలుస్తోంది. వీళ్ల ఫామ్ ని బట్టి ఎలాగో పేరున్న కథానాయకులు వీళ్లతో సినిమాలు చేసే పరిస్థితి లేదిప్పుడు. అందుకే కొత్త కథలు రాసుకొని, కొత్తవాళ్లతోనే తీయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రాలైనా విజయాలు అందించేనా
'నక్షత్రం' తర్వాత నుంచే కృష్ణవంశీ కొత్త చిత్రం కోసం కథపైనే కూర్చున్నారట. అది ఈ మధ్యే ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే పెద్ద వంశీ కూడా 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' తర్వాత ఓ కథ సిద్ధం చేసుకొన్నాడట. అది ఆయన శైలి వినోదంతోనే సాగబోతోందని సమాచారం. ఈయన కూడా ప్రస్తుతం నాయకానాయికల్నిఎంపిక చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు వంశీలకీ కొత్త చిత్రాలు విజయాల్ని తెచ్చిపెడతాయో లేదో చూడాలి.