Sun Dec 29 2024 11:26:26 GMT+0000 (Coordinated Universal Time)
భోళా శంకర్ విడుదలకు అడ్డంకులు?
ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా 'భోళా శంకర్'. ఆగస్టు 11 న సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాను ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. అయితే ఆ సంస్థ తమను మోసం చేసిందంటూ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. పలు సినిమాలను తీసిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు, ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) ఆరోపించారు. తాజాగా ఆయన ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.
ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను మోసం చేశారని అన్నారు బత్తుల సత్యనారాయణ. ఏప్రిల్ ఆఖరులో విడుదలైన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మూడు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు తన సంస్థ గాయత్రి దేవి ఫిలిమ్స్ కు ఇస్తున్నామని అగ్రిమెంట్ రాసి ఇచ్చారన్నారు. 30 కోట్ల రూపాయలు తీసుకుని మరీ మోసగించారన్నారు. బ్యాంకు అకౌంట్ రూపంలో నా సహచర వ్యాపార మిత్రుల సహకారంతో 30 కోట్ల రూపాయలను ఇచ్చి మూడు రాష్ట్రాల హక్కుల కోసం ఎదురుచూశాను. అయితే ఆ సినిమా విడుదల సమయంలో కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే నాకు అందజేసి, అగ్రిమెంట్ కు తూట్లు పొడిచారు. మే 1వ తేదీన హైదరాబాద్ లోని నిర్మాతల ఆఫీస్ కు వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్ ను కలిశానన్నారు సత్యనారాయణ. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడి.. ఏజెంట్ సినిమాకు ఫైనాన్స్ సమస్యలు ఎదురయ్యాయని, సినిమా ప్లాప్ అయ్యిందని చెప్పి మే 2వ తేదీన మళ్ళీ ఆఫీసుకు వస్తే, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారన్నారు. అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వడంతో డబ్బులు ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో తిరిగి వైజాగ్ వెళ్ళిపోయానన్నారు. ఆ తర్వాత వారు చేసిన "సామజవరగమన" చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను విశాఖపట్నం వరకు ఇచ్చారు. ఆ చిత్రం ద్వారా కేవలం కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయ్యింది. ఈ నేపథ్యంలో 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామని, ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తానని ఒప్పంద పత్రం చేశారు. వారి తదుపరి సినిమా "భోళా శంకర్" కాగా.. కొద్ది రోజులుగా వారు నాకు సమాధానం ఇవ్వడం మానేశారు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు కూడా ఈ విషయం చెప్పి, సంప్రదింపులు జరిపినప్పటికీ, ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో కోర్టుకు వెళ్లానని అన్నారు. విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్ గా సినీ పరిశ్రమతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. రంగస్థలం, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి అనేక సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశానని.. ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ తీసిన అనేక సినిమాలను కూడా డిస్ట్రిబ్యూషన్ చేశానన్నారు.
గతంలో ఎప్పుడూ డబ్బు గురించిన సమస్యలు కానీ మోసాలు కానీ తలెత్తలేదని.. ఇప్పుడు ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నా దగ్గర 30 కోట్లు తీసుకుని, సరిగ్గా సమాధానం చెప్పకుండా, ఎగ్గొట్టే ఉద్దేశ్యంతో నా మీద ఫోర్జరీ చేశాననే నింద కూడా వేశారని అన్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ వారికి ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో వీరిపై ఆ సంస్థ కేసులు పెట్టింది. ఎంతోమందిని మోసం చేస్తూ, వీరు తమ గుడ్ విల్ ను పోగొట్టుకున్నారు. ఇంకా ఎంతోమందికి వీరు బాకీలు ఉన్నారని ఆరోపించారు. నా నీతి, నిజాయితీ ఏమిటో సినీ పరిశ్రమతో పాటు అందరికీ తెలుసు. అయితే తెలియని వారికోసమే తప్పనిసరి పరిస్థితులలో ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నానన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు ఎంతో ఇష్టం.. వారు నటించిన సినిమా అనే ఉద్దేశ్యంతోనే నేను ఆచితూచి, ఇంతవరకు ఎక్కడా మీడియాకు ఎక్కలేదు. అయితే నా మీద ఎప్పుడైతే ఫోర్జరీ నింద వేసి, ఆ వార్తలను గ్రూపులలో తిప్పిస్తూ, నన్ను అప్రదిష్టపాలు చేస్తున్నారో అందుకే నేను ప్రెస్ ముందుకు వచ్చానని తెలిపారు. నిజాయితీ, న్యాయం,గెలుస్తాయని నమ్ముతున్నానన్నారు. బుధవారం సాయంత్రం కోర్టులో విషయం తేలిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడుతామని తెలిపారు.
News Summary - distributor vizag sathish press note on bhola shankar movie producers
Next Story