ఫ్యాన్స్ కోసం... మరీ ఇంత త్యాగమా
చిరంజీవి సినిమాలను వదిలేసి రాజకీయాల వెంట పట్టాడు. కానీ రాజకీయాల్లో ఇమడలేక మళ్ళీ సినిమాల్లోకి వచ్చి చేరాడు. వస్తూనే ఖైదీ నెంబర్ 150తో మంచి హిట్ కొట్టాడు.. మెగా అభిమానుల్లో మెగాస్టార్ అంటే పిచ్చ క్రేజ్. ఆ కారణంగానే చిరు రీమేక్ సినిమాతో వచ్చినా ఆదరించారు. ఇక రాజకీయాల కన్నా సినిమాలే బెటర్ అనుకున్న చిరు బాహుబలి స్ఫూర్తితో ఈసారి దేశం మొత్తం క్రేజ్ వచ్చేలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతో సై రా నరసింహ రెడ్డి సినిమాకి శ్రీకారం చుట్టాడు. కానీ సై రా సినిమా పట్టాలెక్కినప్పటి నుండి ఏవేవో సమస్యల వలన సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది.
ఎండలను లెక్క చేయకుండా...
కానీ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సై రా షూటింగ్ జెట్ స్పీడు తో సాగుతుంది. ఇక ఫ్యాన్స్ ని మెప్పించే విధంగా సినిమా ఉండాలని చిరు తహతహలాడుతున్నాడు. అందుకే రాత్రి పగలు సై రా సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలు అంటే ఆంగ్లేయుల మీద దండెత్తే పోరాట సన్నివేశాలు కూడా భారీగా ఉండబోతున్నాయి. అయితే ఆ యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవి ఎండను సైతం లెక్కజెయ్యకుండా.. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడట. నిన్న మొన్నటివరకు వేడి తీవ్రత ఎలా ఉందో తెలిసిందే. అలాంటి మండుటెండల్లో చిరంజీవి ఈ వయసులోనూ ఫ్యాన్స్ కోసం కష్టపడుతున్నాడంటున్నారు.
చిరు డెడికేషన్ అలాంటిది మరి...
కేవలం ఎండ వేడి మాత్రమే కాదు.. షూటింగ్ స్పాట్ లో లైట్స్ వేడిని కూడా చిరు తట్టుకుని షూటింగ్ చేస్తున్నారని... ఎండ తీవ్రత కారణంగా వాతావరణం అనుకూలించక చిరూ అలసటకు లోనవుతున్నా... ఫ్యాన్స్ ని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో అలసటను లెక్కచేయకుండా సై రా షూటింగ్ లో చిరు పాల్గొంటున్నాడట. మరీ ఫ్యాన్స్ కోసం ఈ వయసులో చిరు ఇంత త్యాగం చెయ్యాలా అని కొందరంటుంటే... చిరు డెడికేషన్ అలాంటిది.. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి కొద్దిగా కూడా గ్యాప్ తీసుకోకుండా కొరటాల శివకి కమిట్ అయినట్లుగా తెలుస్తుంది..