Mon Dec 23 2024 07:59:24 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ సినిమా సెట్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో అర్థరాత్రి సమయంలో సెట్ లో మంటలు ఎగసిపడ్డాయని సెట్ వర్కర్స్ తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. వకీల్ సాబ్, భీమ్లానాయక్ చిత్రాలతో వరుస హిట్స్ కొట్టిన పవన్.. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. హరిహర వీరమల్లు, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాల షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు సినిమా సెట్ లో గత అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో అర్థరాత్రి సమయంలో సెట్ లో మంటలు ఎగసిపడ్డాయని సెట్ వర్కర్స్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
గతంలో వేసిన సెట్.. వర్షానికి కూలిపోగా దానికి మరమ్మతులు చేస్తున్న క్రమంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సెట్ లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సెట్ ను మళ్లీ నిర్మించి షూటింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా.. పవన్ కల్యాణ్ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో హరిహర వీరమల్లుపై భారీ అంచనాలున్నాయి. రూ. 150 -200 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ బంధిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
Next Story