Mon Dec 23 2024 16:32:42 GMT+0000 (Coordinated Universal Time)
విడాకుల తర్వాత చనిపోతా అనుకున్నా.. కానీ అంతకంటే..?
మొదటిసారిగా సమంత నాగ చైతన్యతో తమ విడాకుల విషయంపై స్పందించారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, హీరో అక్కినేని నాగచైతన్య లు రెండు నెలల క్రితమే తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సమంత ఎప్పుడు తమ విడాకుల విషయంపై ఎక్కడా మాట్లాడింది లేదు. తాము విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో కూడా ఇద్దరిలో ఎవరూ చెప్పలేదు. మొదటిసారిగా సమంత తమ విడాకుల విషయంపై స్పందించారు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెను విడాకుల గురించి ప్రశ్నించగా.. సమంత తమ బాధను చెప్పుకొచ్చారు.
చనిపోవాలనుకున్నా...
చైతూ తో విడాకుల అనంతరం తాను కుంగిపోయి చనిపోతాననుకున్నా అని, కానీ అంతకంటే స్ట్రాంగ్ అయ్యానని చెప్పుకొచ్చారు. సమంత మాటల్లో "ఇప్పటికీ బాధపడిన ఆ రోజులు గుర్తున్నాయి. చైతూతో విడిపోతున్నప్పుడు కుంగిపోయి చనిపోతాననుకున్నాను. కానీ, నేను అనుకున్న దానికంటే శక్తిమంతురాలిని అయ్యాను. మన జీవితంలో కొన్నిరోజులు బాగోలేనప్పుడు వాటిని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వాటిని అంగీకరించి ముందుకు వెళ్తామో సగం పని అయినట్లే. ఎప్పుడైతే మనం అంగీకరించమో! అంతం లేని యుద్ధం చేస్తున్నట్లే! నిజానికి నేను చాలా బలహీనమైన, సున్నితమైన వ్యక్తిని అని అనుకుంటా. కానీ నా వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఇంత బలంగా ఎదుర్కోవడం చూసి నాకే ఆశ్చర్యమేస్తోంది. ఇంత దృఢంగా ఉంటానని అనుకోలేదు" అని చెప్పారు.
కెరీర్ మీదనే....
విడాకుల తర్వాత సమంత తన కెరీర్ మీద పూర్తిగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఆమె కొత్త సినీ ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నారు. 'యశోద' అనే పాన్ ఇండియా చిత్రంతో పాటు 'ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే అంతర్జాతీయ చిత్రంలో ఆమె నటించనున్నారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన 'శాకుంతలం' త్వరలోనే విడుదలకానుండగా... సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప లో సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. ఈ పాటకు సమంత హీరోయిన్ కన్నా ఎక్కువ పారితోషికం పుచ్చుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
Next Story