Sun Dec 22 2024 21:46:44 GMT+0000 (Coordinated Universal Time)
గేమ్ చేంజర్ సాంగ్ లీక్.. పోలీసులను ఆశ్రయించిన చిత్ర బృందం
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం గేమ్ చేంజర్
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా సాంగ్ ఆన్ లైన్ లో లీకైనట్టు చిత్రబృందం గుర్తించింది. గేమ్ చేంజర్ చిత్రంలోని 'జరగండి జరగండి' అనే పాట ఆన్ లైన్ లో లీక్ అయినట్టుగా నిర్మాణ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగమ్మాయి అంజలి మరో కథానాయికగా నటిస్తూ ఉంది. శ్రీకాంత్, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ లీక్ పై తాము ఫిర్యాదు చేశామని, హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారని గేమ్ చేంజర్ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఐపీసీ 66 (సి) కింద ఈ క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. గేమ్ చేంజర్ పాటను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తమ కంటెంట్ ను అక్రమంగా బయటకు విడుదల చేశారని, ఏమాత్రం నాణ్యత లేని ఆ కంటెంట్ ను మరింత వ్యాప్తి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కోరింది.
Next Story