Tue Dec 24 2024 18:02:29 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వాల జోక్యంపై నటుడు సిద్ధార్థ్ అసంతృప్తి
సినిమా టిక్కెట్ల విషయంలో ప్రభుత్వాల జోక్యంపై హీరో సిద్ధార్థ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
ఇటీవల కాలంలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సినిమా టికెట్లను ఎంతకైనా విక్రయించుకోవచ్చని హైకోర్టు చెప్పగా.. ఏపీలో మాత్రం ప్రభుత్వం చెప్పిన ధరలకే టికెట్లను విక్రయించాలని ఏపీ సర్కార్ షరతులు విధించింది. ఈ విషయంపై నటుడు సిద్ధార్థ్ స్పందించారు. సినిమా టికెట్లను విక్రయించడంలో ప్రభుత్వాల జోక్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. #SaveCinema హ్యాష్ టాగ్ తో వరుస ట్వీట్లు పెట్టారు. సినీ పరిశ్రమపై ఆధారపడి ఎంతోమంది జీవనం సాగిస్తున్నారని, అలాంటి పరిశ్రమనే ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు.
ఇరవై ఐదేళ్ల క్రితమే...
"25 సంవత్సరాల క్రితం మొదటిసారి నా స్టూడెంట్ ఐడీకార్డు ఉపయోగించి విదేశాల్లో సినిమా చూశాను. అప్పట్లోనే సినిమా చూసేందుకు 8 డాలర్లు అంటే సుమారుగా రూ.200 సినిమా కోసం ఖర్చు చేశాను. అప్పటి సినిమాల కన్నా ఇప్పటి సినిమాలు ఏమాత్రం తక్కవ కాదు. నిజానికి ప్రస్తుతం మనం నిర్మిస్తున్న చిత్రాలు టెక్నాలజీ, టాలెంట్లో మిగతా దేశాల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. సినిమా టికెట్లు, పార్కింగ్ రేట్లపై ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు ఎలాంటి హక్కు లేదు. సినిమా కంటే మద్యం, పొగాకుకు మీరు ఎక్కువ గౌరవమిస్తున్నారు. నియంత్రించాలనుకుంటే వాటి ధరలను నియంత్రించండి. అంతేగాని ఎన్నో వేలమంది ప్రజలు ఆధారంగా జీవిస్తున్న సినీ పరిశ్రమను టార్గెట్ చేయకండి. పన్నులు, సెన్సార్ విషయంలో మీరు ఏం చెప్పినా వింటున్నాం.
మా వ్యాపారం...
అలాగని మా వ్యాపారం ఎలా చేసుకోవాలో మీరు మాకు నేర్పనక్కర్లేదు. మాకు తెలుసు.. మా వ్యాపారం ఎలా చేసుకోవాలో. మీకు ఆదాయం కావాలనుకుంటే ప్రతి పరిశ్రమలోనూ ఎంతో మంది సంపన్నులున్నారు.. వాళ్ల నుంచి కూడా తీసుకోండి. సినిమా బడ్జెట్ అనేది కొనుగోలుదారుడిపై ఆధారపడదు. ఆ సినిమా దర్శకుడు, నిర్మాతపై ఆధారపడి ఉంటుంది. సినిమా ద్వారా ఎవరు ఎంత సంపాదిస్తారో నిర్ణయించే హక్కు ఏ ఒక్కరికీ లేదు. పేదరికం నుంచి వచ్చి ధనికులుగా రాణిస్తున్న రాజకీయనాయకులను ప్రశ్నించగలరా? పరిశ్రమను వేధించడం ఇకనైనా ఆపండి. మనకి తిండి పెడుతున్న రైతులు ఎంత గొప్పవాళ్లో మనందరికీ తెలుసు.. ఇప్పటికే వాళ్ల కోసం మేము పోరాటం చేశాం. మేము రైతులంత గొప్పవాళ్లం కాకపోవచ్చు. కానీ మేము కూడా మనుషులం, పన్నుచెల్లింపుదారులం" అంటూ నటుడు సిద్ధార్థ్ ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story