తెలుగు సినిమా ' హీరో ' కనుమరుగేనా..
తెలుగు సినిమారంగం కొత్తరూపు దాల్చుతోంది. తెలుగు సినిమాల్లో హీరోయిజాలు, హీరోలు కనుమరుగయ్యే రోజులు వచ్చేశాయి. హీరోలు కనుమరుగు అంటే హీరోలు లేని సినిమాలు అని కాదు.. ఇక్కడ ట్రెండ్ మారుతోంది. కథనే హీరోగా నిలబడుతోంది. తొడగొడితే అభిమానులు పడిపోయే రోజులు పోతున్నాయి. గాల్లోకి ఎగిరిన సుమోలతోపాటు అమాంతం ఊగిపోయే అభినమానలోకం కనుమరుగువుతోంది. హీరో గుద్దితో వందలాది రౌడీలు గాల్లోకి ఎగరడాలు... అద్దాలు పగలడాలను ఇప్పుడు ఎవ్వరూ హర్షించడం లేదు. ఈ ట్రెండ్‌కు పూర్తిగా కాలం చెల్లిపోయింది.
ఐదారు పాటలు, నాలుగైదు ఫైట్లుతో రీళ్లకు రీళ్లు చుట్టేసి పరమ రొటీన్ కథలతో తీసే సినిమాలకు కాలం చెల్లింది. ఇలాంటి సినిమాలు ఆడుతోన్న థియేటర్లు ఉన్న వీథుల్లోకి వెళ్లేందుకు కూడా జనాలు సాహసించని పరిస్థితి. కథలో బలం లేకుండా కేవలం పెద్ద నిర్మాత, పెద్ద దర్శకుడు, పెద్ద హీరోల పేరిట సినిమా నిలబడలేకపోతోంది. కథ బలంగా ఉంటేనే జనం జేజేలు పలుకుతున్నారు. ఇటీవల ఈ విషయం అనేక సార్లు నిరూపితమైంది. కోట్లకు కోట్లు కుమ్మరించి, భారీ సెట్టింగులు, విడుదలకు ముందు హైప్ క్రియేట్ చేయడం.. ఈ ట్రిక్కులన్నీ పెద్దగా పనిచేయడం లేదు.
ఇందుకు తెలుగుప్రేక్షకుల సినిమాను చూసే దృష్టి మారుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు దర్శకులు, పెద్ద హీరోలు కూడా తమ హీరోయిజాన్ని పక్కనపడేసి పాత్రనే నమ్ముకుని ముందుకు రావాల్సిన గుణాత్మక మార్పు తెలుగు సినీ రంగంలో వచ్చింది. అంతెందుకు పెద్ద హీరోల సినిమాలు, స్టార్ మీరోలు, దర్శకుల కాంబినేషన్లో వస్తోన్న సినిమాలను భారీ ఎత్తున, వందలాది థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా హిట్ అయితే ఓకే రెండు మూడు రోజులు చూస్తున్నారు. ప్లాప్ టాక్ వస్తే మ్యాట్నీకే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. అదే చిన్న సినిమాలు మంచి కథాబలంతో వస్తే ముందుగా తక్కువ స్క్రీన్లు, ఏ సెంటర్లలో రిలీజ్ అయినా టాక్ బాగుంటే నెమ్మదిగా ఫికప్ అవుతున్నాయి. స్క్రీన్లు పెంచుకుంటూ పోతుంటే వసూళ్లు అవే వస్తున్నాయి.
ఇప్పుడు సినిమా అంతా వన్ వీకే అన్న నానుడి పెద్ద హీరోల సినిమాలకు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ కథాబలంతో ఉన్న సినిమాలకు లాంగ్ రన్ ఉంటుందన్నది మహానటి, రంగస్థలంతో స్పష్టమైంది. కథ, పాత్రల చిత్రీకరణపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటోంది. రెండు మూడేళ్లుగా తెలుగులో వచ్చిన పలు చిన్నసినిమాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఘాజీ మూవీ డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డి మొదటి ప్రయత్నంలోనే జాతీయస్థాయి అవార్డు గెలుచుకున్నాడు. అంతకుముందు పెళ్లిచూపులు సినిమా డైరెక్టర్ తరుణ్‌భాస్కర్ కూడా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.
తాజాగా వచ్చిన మహానటి సినిమా కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇది రెండో సినిమా మాత్రమే కావడం గమనార్హం. ఇక సైలెంట్‌గా వచ్చిన అర్జున్‌రెడ్డి మూవీ పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ తెలుగుసినిమా పోకడను మార్చేశారు. అంతేగాకుండా తమిళ చిత్రం మూలంగా నిర్మించిన కర్తవ్యం సినిమా కూడా తెలుగుప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక వరుణ్‌తేజ్ ఫిదా ఏకంగా 50 రోజుల పాటు థియేటర్లలో కంటిన్యూ అయ్యింది. బిచ్చగాడు లాంటి డబ్బింగ్ సినిమా తెలుగులో 100 రోజుల ఆడి పెద్ద సంచలనమే రేపింది.
తెలుగు సినిమారంగం నాలుగైదు కుటుంబాల చేతుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. కథే బలంగా, పాత్రల చిత్రీకరణే వినూత్నంగా వచ్చిన పలు చిన్నసినిమాలు పెద్ద నిర్మాతలను, డైరెక్టర్లను, పెద్ద హీరోలను తీవ్ర ప్రభావితం చేశాయి. నిశ్శబ్దంగా సాగిన ఈ గుణాత్మక మార్పుతో పెద్ద హీరోలతోపాటు, వారి వారసులు కూడా తమ పంథాను మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో పలువురు వారసులు తమ కుటుంబ నేపథ్యంతోకంటే.. తమ నటనతోనే ఈనాడు తెలుగు సినిమా రంగంలో నిలబడగలుగుతున్నారు. వారసత్వం, స్టార్ హీరోయిజం అనే పదానికి దూరంగా వాళ్లు కూడా కథాబలం ఉన్న సినిమాలే చేస్తూ సక్సెస్‌లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సామాజిక దృక్కోణం ఉన్న సినిమాల్ని కూడా మహేశ్ చేసి మెప్పించారు. ఇక రంగస్థలం లాంటి సినిమాలో హీరో చరణ్ తనపాత్రను హీరోయిజాన్ని పక్కనపెట్టేసి ఒప్పుకోవడానికి కూడా ఇదే కారణంగా పలువురు భావిస్తున్నారు.
అగ్ర హీరోలు కూడా హీరోయిజం ఉన్న కథలను పక్కన పెట్టేస్తున్నారు. మూస పాత్రలతో సినిమాలు చేసి వరుస ప్లాపులు ఎదుర్కొన్న ఎన్టీఆర్ రూటు మార్చుకున్నాక ఇప్పుడు వరుస హిట్లతో వెళుతున్నాడు. మహేష్ కూడా అంతే బలం లేని కథలు ఎంచుకుని వరుస ఎదురు దెబ్బలు తిని ఇప్పుడు జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. పరమ రొటీన్ కథలతో యావరేజ్ సినిమాలతో కాలం వెళ్లదీస్తోన్న రామ్‌చరణ్ ఇప్పుడు రంగస్థలంతో ఎక్కడికో వెళ్లిపోయాడు. ఈ పరిణామాలు అన్ని తెలుగు సినిమా అనేది హీరో సినిమా కాదు... కథే హీరో అనేందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.