Mon Dec 23 2024 07:21:18 GMT+0000 (Coordinated Universal Time)
Nani : పొలిటికల్ ప్రచారంలో టాలీవుడ్ స్టార్స్..
సినీ స్టార్స్ ఇమేజ్ ని రాజకీయ నాయకులు తమ ప్రచారం కోసం ఉపయోగించుకునే విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్..
ప్రస్తుతం దేశంలో ఒక పక్క వన్డే ప్రపంచ కప్ ఫీవర్, మరో పక్క ఎలక్షన్స్ ఫీవర్ కొనసాగుతుంది. ఈ ఆదివారంతో వరల్డ్ కప్ జోరు ముగుస్తుంటే.. ఎలక్షన్స్ జోరు మరింత పుంజుకుంటుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎలక్షన్స్ సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులంతా ప్రచారాలతో సందడి చేస్తున్నారు. ఇక ఈ ఎలక్షన్స్ కాంపెయిన్స్ లో అప్పుడప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ కూడా కనిపిస్తుంటారు.
సినీ పరిశ్రమలో ఆ స్టార్స్ కి ఉన్న ఇమేజ్ ని రాజకీయ నాయకులు తమ ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ చేస్తున్న పని ఏంటిరా అంటే.. తమ సినిమాల ప్రమోషన్స్ కోసం పాలిటిక్స్ ని ఉపయోగించుకుంటున్నారు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా.. ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్నది అదే. నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా 'హాయ్ నాన్న' కోసం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన కొత్త ప్రాజెక్ట్ కోసం పాలిటిక్స్ రూపంలో ప్రచారం మొదలు పెట్టారు.
నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన 'హాయ్ నాన్న' డిసెంబర్ 7న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని నాని దగ్గరుండి నడిపిస్తున్నారు. సాంగ్ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, స్పెషల్ ప్రోగ్రాంలు.. ఇలా సినిమాని ఆడియన్స్ లోకి ఏ రకంగా తీసుకు వెళ్లాలో ఆ రకంగా తీసుకు వెళ్తున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే.. "అందరికి హాయ్, మీ ప్రేమ మరియు ఓటు మాకే అవ్వాలని" కోరుకుంటున్నట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో నాని రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు.
ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. తెలుగు ఓటీటీ ఆహాలో ఒక షో చేయబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఆహాలో ప్రసారమయ్యే ఒక షోలో ఈ దర్శకుడు జడ్జిగా కనిపించారు. ఇప్పుడు మరో కొత్త షోలో కూడా కనిపించబోతున్నారు. "త్వరలో నేను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాను, మా అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటిస్తాను" అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆహా లోగో ఉండడంతో ఇది కొత్త షో అని అర్ధమవుతుంది. అయితే ఆ షోకి పాలిటిక్స్ లింక్ ఏంటనేదే సస్పెన్స్ గా ఉంది.
Next Story