Fri Nov 22 2024 21:06:15 GMT+0000 (Coordinated Universal Time)
జమున మృతి పట్ల సీఎంలు జగన్, కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ప్రముఖ నటి జమున(86) ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటితరం నటీమణులలో అగ్రకథానాయికగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
జమున మరణం సినీపరిశ్రమకు తీరని లోటని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను కేసీఆర్ స్మరించుకున్నారు. కళాసేవే కాకుండా పార్లమెంట్ సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం కూడా గొప్ప విషయమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. "అలనాటి సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత శ్రీమతి జమున గారు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ వివిధ పాత్రల్లో నటించి మెప్పించిన జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను." అని ట్వీట్ చేశారు.
చిరంజీవి స్పందిస్తూ.. ‘సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తదితర సినీ ప్రముఖులు జమున మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. ట్వీట్లు చేశారు.
Next Story