Sat Dec 21 2024 16:41:27 GMT+0000 (Coordinated Universal Time)
ప్లీజ్ ఛాన్సులివ్వండి అంటూ అవినాష్.. చాలారోజులకు కనిపించిన ప్రదీప్..
టీవీ షోలతో ఎంతో ఫేమ్ సంపాదించుకున్న ముక్కు అవినాష్, యాంకర్ ప్రదీప్.. గత కొంతకాలంగా టీవీ షోల్లో కనిపించడం మానేశారు.
Jabardasth Avinash - Anchor Pradeep : తెలుగు టీవీ షోలతో పలువురు యాక్టర్స్ ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. అలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎంతో గుర్తింపుని సంపాదించుకున్న నటుల్లో ముక్కు అవినాష్, యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నారు. జబర్దస్త్ షోతో ముక్కు అవినాష్ అలరిస్తే, ఢీ మరియు పలు ఎంటర్టైన్మెంట్ షోలతో యాంకర్ ప్రదీప్ అలరిస్తూ వచ్చారు. బుల్లితెర పై ఆకట్టుకున్న ఈ ఇద్దరు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.
అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు టీవీ షోల్లో కనిపించడం మానేశారు. ముక్కు అవినాష్ విషయానికి వస్తే.. సినిమా అవకాశాలు కోసం టీవీ షోలు చేయడం తగ్గించాడు. కానీ ఫిలిం మేకర్స్ ఏమో.. అవినాష్ టీవీ షోలు చేస్తున్నాడని, సినిమాలు చేయడానికి డేట్స్ ఇస్తాడో లేదో అని అవకాశాలు ఇవ్వకుండా ఉంటున్నారు. దీంతో అవినాష్ బుల్లితెర పై వెండితెర పై కనిపించకుండా మిగిలిపోతున్నాడు.
ఈ విషయం పైనే అవినాష్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ప్లీజ్ ఛాన్సులివ్వండి అంటూ ఫిలిం మేకర్స్ ని వేడుకున్నారు. 'మార్కెట్ మహాలక్ష్మి' మూవీలో నటించిన అవినాష్, ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. "సినిమా కోసం టీవీ షోలు అన్ని వదులుకున్నాను. ప్రస్తుతం ఒక షో మాత్రమే చేస్తున్నాను. కావాలంటే అది కూడా మానేస్తాను. ప్లీజ్ నాకు ఛాన్సులు ఇవ్వండి" అంటూ మేకర్స్ ని వేడుకున్నారు.
ఇక యాంకర్ ప్రదీప్ విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగు టీవీలోని ప్రతి షోకి యాంకరింగ్ చేస్తూ కనిపించిన ప్రదీప్.. ఇప్పుడు ఒక్క షోలో కూడా కనిపించడం లేదు. ఢీ షోతో పాటు అన్ని షోలు నుంచి ప్రదీప్ తప్పుకున్నారు. దీంతో గత కొంతకాలంగా టీవీలో ప్రదీప్ సందడే కనిపించకుండా పోయింది. అసలు ప్రదీప్ ఎందుకని కనిపించడం లేదో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ యాంకర్.. జిమ్ లో కసరత్తులు చేస్తూ భారీ కండలు పెంచుతూ కనిపిస్తున్నారు. ప్రదీప్ గతంలో హీరోగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు కూడా అలా ఏమైనా సినిమాకి సైన్ చేసారా అనే సందేహం ఈ జిమ్ వీడియో చూసిన తరువాత కలుగుతుంది. ఇక వీడియో చూసిన నెటిజెన్స్ మాత్రం.. ప్రదీప్ ని మల్లి బుల్లితెర పైకి రావాలంటూ కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story