Mon Dec 23 2024 02:04:49 GMT+0000 (Coordinated Universal Time)
ఈ కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ దూరం..!
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు రూ.100 స్మారక నాణేన్ని విడుదల కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ దూరం. దీంతో నందమూరి అభిమానులు..
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) శతజయంతి.. ఈ ఏడాది ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా వేడుకలు నిర్వహిస్తూ సంవత్సరం పాటు శతజయంతిని జరిపారు. ఇక తాజాగా భారత్ ప్రభుత్వం.. 100వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చిత్రం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేయబోతున్నారు.
నేడు ఆగష్టు 28న రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఈ రూ.100 నాణేన్ని(100 Rupees Coin) విడుదల చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, టీడీపీ, బీజేపీ పార్టీలతో పాటు పలు ప్రముఖ నాయకులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈక్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ (NTR) కూడా ఆహ్వానం అందింది. కానీ తారక్ మాత్రం ఈ కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నాడు.
గతంలో విజయవాడ, హైదరాబాద్ లో జరిగిన శతజయంతి కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ సమయంలో నందమూరి అభిమానులని ఈ విషయం చాలా బాధ పెట్టింది. ఇక ఇప్పుడు భారత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ దూరంగా ఉండడం ఫ్యాన్స్ ని ఆవేదనకు గురి చేస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర (Devara) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇచ్చిన డేట్స్ వలనే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నాడని కొంతమంది చెబుతున్నారు.
అయితే మరికొంతమంది మాత్రం.. ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకనే పొలిటికల్ లీడర్స్ హాజరయ్యే వేడుకలకు, పొలిటికల్ ఈవెంట్స్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వల్లే.. తారక్ ఈ కార్యక్రమానికి కూడా రావడం లేదని చెబుతున్నారు. అలాగే ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కూడా తముడితో పాటు ఈ కార్యక్రమాలకు ముందు నుంచి దూరం వహిస్తూ వస్తున్నాడు. కారణాలు ఏవైనా.. నందమూరి వారసులు ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Next Story