Mon Dec 23 2024 16:33:20 GMT+0000 (Coordinated Universal Time)
మెగాస్టార్ తో తీసిన మూడు సినిమాలకు ఫిలింఫేర్, నంది అవార్డులు
ఈ సినిమానే చిరంజీవికి తొలిసారిగా బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చిరంజీవి..
తెలుసు సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. కళనే కథగా చూపించి.. మెప్పించి, మురిపించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన జీవితంలో.. ఎన్నో మరపురాని చిత్రాలను తెరకెక్కించారు విశ్వనాథ్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన విశ్వనాథ్ ఎంతో మంది స్టార్ హీరోలను డైరెక్ట్ చేశారు. విశ్వనాథ్ గారి సినిమాలో ఆయనకు నచ్చేటట్టు నటించడం హీరోలు ఒక ఛాలెంజ్ గా భావించేవారు. చిరంజీవి, కమల్ హాసన్, వెంకటేష్ ఆయన దర్శకత్వంలో డిగ్రీలు అందుకున్న హీరోలు.
మెగాస్టార్ - విశ్వనాథ్ కాంబినేషన్లో మూడు సినిమాలొచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా శుభలేఖ. చిరంజీవి - సుమలత జంటగా నటించిన ఈ సినిమా 1982లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమానే చిరంజీవికి తొలిసారిగా బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చిరంజీవి వెనుదిరిగి చూసుకోలేదు. ఖైదీ, గుండా, అడివి దొంగ, రాక్షసుడు వంటి సినిమాలతో మాస్ హీరోగా ఎదిగారు. అలాంటి టైమ్ లో "స్వయంకృషి"తో పెద్ద సాహసమే చేశారు విశ్వనాథ్. మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవితో.. ఆ సినిమాలో చెప్పులు కుట్టించి ఆశ్చర్యపరిచారు. మాస్ కు పూర్తిభిన్నంగా ఉంటుందీ సినిమా.
విజయశాంతి, సుమలతలు హీరోయిన్లుగా నటించిన "స్వయంకృషి"తో చిరంజీవి నంది అవార్డు అందుకున్నాడు. 1992లో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది ఆపద్భాంధవుడు. విశ్వనాథ్ - చిరంజీవి కలయికలో వచ్చిన ఆఖరి సినిమా ఇది. చిరంజీవి నటనను తారాస్థాయిలో చూపించారు విశ్వనాథ్. ఈ సినిమాలో చిరంజీవి.. తనను చేరదీసి, తనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చిన కుటుంబానికి ఆపద్భాంధవుడులా నిలుస్తాడు. హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఒక సంఘటనతో మెంటల్ హాస్పిటల్ చేరుతుంది. ఆమెను నార్మల్ గా మార్చడానికి తాను పిచ్చి వాడిలా నటిస్తాడు చిరంజీవి. ఈ సినిమాలో చిరంజీవి నటనకు ఫిలింఫేర్, నంది అవార్డులు వచ్చాయి. అలా విశ్వనాథ్ - చిరంజీవి కలయికలో వచ్చిన మూడు సినిమాలు రెండు ఫిలింఫేర్, రెండు నంది అవార్డులను అందుకున్నాయి.
Next Story