Thu Dec 26 2024 03:25:03 GMT+0000 (Coordinated Universal Time)
అజ్ఞాతాన్ని వీడిన కరాటే కల్యాణి.. ఆ పాపను దత్తత తీసుకోలేదా ?
తాను పెద్దగా చదువుకోకపోయినా తనకు కూడా రూల్స్ తెలుసునని.. ఒక సంవత్సరం వయసు వచ్చిన తర్వాత పాపను..
హైదరాబాద్ : కరాటే కళ్యాణి.. గత కొద్దిరోజులుగా ఆమె చుట్టూ వివాదాలే నిండి ఉన్నాయి. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో ఆమె గొడవకు దిగడం.. ఆ తర్వాత ఆ వీడియోలు వైరల్ అవ్వడం తెలిసిందే..! ఆ గొడవ జరిగిన సమయంలో ఆమెతో పాటూ ఓ చిన్న పాప కూడా ఉంది. శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగిన సమయంలో ఆ పాప కూడా కింద పడింది. ఇంతకూ కరాటే కళ్యాణికి ఆ పాపకు ఏంటి సంబంధం అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఉత్పన్నమయ్యాయి. మరో వైపు ఆ పాపను నిబంధనలకు విరుద్ధంగా కరాటే కళ్యాణి తన దగ్గర ఉంచుకుందనే అభియోగాలు ఆమెపై మోపబడ్డాయి. దీంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె నివాసంలో సోదాలను కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆమె అక్కడ కనిపించకపోవడంతో పారిపోయిందని, అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని కొన్ని కథనాలు మీడియాలో వచ్చాయి.
వీటన్నిటికీ సమాధానం చెప్పే ఉద్దేశ్యంతో కరాటే కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎవరూ తనను దాయలేదని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. తనకు ఆడపిల్లలను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఈ పాపను పెంచుకోవాలని అనుకుంటూ ఉన్నానని ఆమె తెలిపారు. తాను పెద్దగా చదువుకోకపోయినా తనకు కూడా రూల్స్ తెలుసునని.. ఒక సంవత్సరం వయసు వచ్చిన తర్వాత పాపను దత్తత తీసుకోవాలని అనుకుంటూ ఉన్నట్లు కరాటే కళ్యాణి మీడియాకు తెలిపారు. ఆ పాప తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలని.. వారిని గొప్పగా చదివించే స్థోమత వారికి లేదని.. వారు కూడా పిల్లలతో కలిసి తన ఇంట్లోనే ఉన్నారని కరాటే కళ్యాణి అన్నారు. కొన్ని సమస్యల కారణంగా నేను పిల్లలను కనలేనని అందుకే ఈ పాపను దత్తత తీసుకోవాలని యోచిస్తూ ఉన్నానని కరాటే కళ్యాణి వెల్లడించారు.
చాలా మంది మీద పైట్ చేస్తా కాబట్టే నచ్చని వాళ్లుంటారని... తనపై కుట్రల్లో రాజకీయ పార్టీల వాళ్లు కూడా ఉన్నారని కళ్యాణి అన్నారు. తన ఇంట్లో పిల్లలు శివాజీ, ఝాన్సీలా పెరగాలని ఆలోచిస్తానని.. తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరటానికి సిద్ధమని అన్నారు. తనపై తప్పుడు వార్తలు ఇస్తున్నవారు ఆధారాలు చూపించగలరా అని ప్రశ్నించారు. ఫోన్ ప్రాబ్లెం ఉండి స్విచ్ ఆఫ్ అయితే పారిపోయానని ప్రచారం చేశారన్నారు. ఎక్కడికీ పారిపోలేదని వివరించారు. గతంలో సింగరేణి కాలనీలో ఓ అమ్మాయికి సమస్య వస్తే.. సమాజం పట్ల ఉన్న బాధ్యతతో ఓ పోస్టు పెడితే తనపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారని, చివరికి కోర్టే ఆ కేసు పెట్టిన వాడికి మొట్టికాయలు వేసిందన్నారు. అవకాశం కోసం ఎదురుచూసిన వాళ్లు శ్రీకాంత్ రెడ్డితో ఇష్యూ తర్వాత తనపై దుష్ప్రచారం చేసి తప్పుడు కేసులు పెట్టారని కల్యాణి ఆరోపించారు. తను ఏ తప్పు చేశానని ఇంటిని రైడ్ చేస్తారని ప్రశ్నించారు.
Next Story