Fri Nov 22 2024 21:55:48 GMT+0000 (Coordinated Universal Time)
పునీత్ రాజ్ కుమార్ పేరిట ఉపగ్రహం.. విద్యార్థులే రూపకర్తలు
పునీత్ పేరిట శాటిలైట్ ను రూపొందించనున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ ప్రకటించారు. బెంగళూరులోని..
బెంగళూరు : కన్నడ పవర్ స్టార్ గా సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే కన్నుమూసి, అభిమానులందరినీ శోకసంద్రంలో ముంచేశారు. ఆయన ఇక లేరు, తిరిగి రారు అన్న విషయాన్ని పునీత్ అభిమానులు, కుటుంబ సభ్యులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేరన్న దుఃఖంతో ఇటీవలే ఆయన మామగారు కూడా కన్నుమూశారు. పునీత్ స్మారకార్థం ఓ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.
పునీత్ పేరిట శాటిలైట్ ను రూపొందించనున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ ప్రకటించారు. బెంగళూరులోని ప్రముఖ పీయూ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉపగ్రహ తయారీ కోసం ప్రభుత్వం తరపున రూ.1.90 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల తోనే ఈ ఉపగ్రహాన్ని తయారు చేయిస్తామని పేర్కొన్నారు. 50 కిలోల శాటిలైట్ ను రూపొందించేందుకు రూ. 50 నుంచి 60 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పిన అశ్వత్థనారాయణ.. కిలో బరువున్న శాటిలైట్ ను విద్యార్థులు రూ.1.90 కోట్ల ఖర్చుతో రూపొందిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టులో 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులు భాగస్వాములవుతారని మంత్రి వెల్లడించారు.
Next Story