కోలీవుడ్ హీరోలను చూసైనా మన హీరోలు మారరా...?
కోలీవుడ్ హీరోలు ఇప్పుడు తెలుగులో రియల్ హీరోలుగా కనబడుతున్నారు. వారి డెడికేషన్ ముందు టాలీవుడ్ హీరోలు తేలిపోతున్నారు. మొన్నటికి మొన్న విశాల్ రైతుల పాలిట హీరో అయ్యాడు. అలాగే తన ప్రెస్ మీట్ ఒకటి హైద్రాబాద్ లో జరుగుతుంటే... చెన్నై నుండి ఫ్లైట్ లో వచ్చిన విశాల్ ట్రాఫిక్ లో ఇరుక్కుని ఒక బైక్ మీద ప్రెస్ మీట్ కి టైం వచ్చి అందరినీ ఆశ్చర్యంలో పడేశాడు. తాజాగా చినబాబు హీరో కార్తీ కూడా తన సినిమా సక్సెస్ మీట్ కి హైదరాబాద్ లో అలాంటి ఫీట్ చేసాడు. హైదరాబాద్ లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అన్ని ఏరియాలలోను ఇదే ట్రాఫిక్ జాం ఉంటుంది. అయితే కార్తీ నటించిన చినబాబు సక్సెస్ మీట్ కి హాజరవడానికి గాను కార్తీ కారులో బయలుదేరగా... ట్రాఫిక్ లో ఇరుక్కుని తన సక్సెస్ మీట్ కి టైం కి వెళ్లలేనేమో అనే భయంతో కార్తీ... చినబాబు యూనిట్ లోని కొందరితో కలిసి ఒక ఆటో లో సక్సెస్ మీట్ కి వచ్చి ఔరా అనిపించాడు.
ట్రాఫిక్ ఉందని ఆటోలో ...
మరి వారికున్న కమిట్మెంట్ కి ఇలా ఆటోలో, బైక్స్ మీద రావడం అనేది చాల బావుంది. మరి హైదరాబాద్ ట్రాఫిక్ లో ఇరుక్కుంటే.. నిజంగానే అనుకున్న టైంకి చేరలేక జనాలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. మరి కార్తీ ఇలా కారులో ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పటికీ.. తెలివిగా ఆటో లో సక్సెస్ మీట్ కి చేరుకోవడం మాత్రం అందరూ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు.
మన హీరోలు ఉన్నారు...
ఇక టాలీవుడ్ లో కొందరు హీరోలు తమ సినిమాల ప్రెస్ మీట్ కి చెప్పిన టైంకి రారు. ప్రెస్ మీట్ ని చిత్ర బృందం హ్యాండిల్ చేస్తున్నప్పుడు చల్లగా వస్తారు సదరు హీరోలు. ఇక ట్రాఫిక్ లో ఇరుక్కుంటే గనక ఆ ఆడియో లాంచ్ వేడుకో, లేదంటే ఇంకేదన్న ప్రెస్ మీట్ అయినా సరే ఆ కార్యక్రమానికి చివరిలో హాజరై ట్రాఫిక్ లో ఇరుక్కుని రాలేకపోయానంటూ చాలా లైట్ తీసుకుంటారు. కానీ టాలీవుడ్ హీరోల ముందు కోలీవుడ్ హీరోలు ఇలాంటి ఫీట్స్ తో శభాష్ అనిపించుకుంటున్నారు.