Mon Dec 23 2024 11:18:57 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన మొగల్తూరు రారాజు కృష్ణంరాజు అంత్యక్రియలు
తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. భారీ సంఖ్యలో అభిమానులు..
మొగల్తూరు రారాజు, సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలు కుటుంబసభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి కనకమామిడి ఫాంహౌస్ వరకూ ఆయన పార్థివ దేహానికి అంతిమ యాత్ర నిర్వహించారు. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ కృష్ణంరాజుకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్ నిర్వహించారు. అధికారిక లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్ లోకి అనుమతించారు.
187కి పైగా చిత్రాల్లో నటించి, వాజ్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజుకి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఏపీ మంత్రి రోజా, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు రాజకీయ నేతలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కృష్ణంరాజు పార్థివ దేహాన్ని చూసి నటి జయప్రద కన్నీటిపర్యంతమయ్యారు. ఇండస్ట్రీ సీనియర్, జూనియర్ నటీ నటులు ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. టాలీవుడ్ కి ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరన్నారు. దాసరి నారాయణ తర్వాత.. ఇండస్ట్రీకిి పెద్దదిక్కుగా నిలిచారని, ఎవరు ఆపదలో ఉన్నారన్నా, ఎవరికి సహాయం కావాలన్నా ఆయన తక్షణమే స్పందించేవారని గుర్తు చేసుకున్నారు.
Next Story