Mon Dec 23 2024 13:20:48 GMT+0000 (Coordinated Universal Time)
మనుషులే కాదు.. మన రెబల్ స్టార్ కి పులి కూడా ఫ్యానే అని తెలుసా ?
గతంలో కృష్ణంరాజు తన భార్య శ్యామలాదేవితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి-పులులకి ఉన్న సంబంధం గురించి చెప్పారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆకస్మిక మరణం టాలీవుడ్ కి తీరనిలోటు. 187 చిత్రాలకు పైగా నటించిన ఆయన.. అనారోగ్యంతో నిన్న తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభాస్ కు పెళ్లిచేయాలన్నది ఆయన చివరి కోరికగా మిగిలిపోయిందని, అది తీరకుండానే వెళ్లిపోయారన్న వార్తలు వైరల్ అయ్యాయి. మరోవైపు కృష్ణంరాజు విజయనగర సామ్రాజ్యానికి చెందిన వంశీయులన్న వార్తలూ వచ్చాయి.
కాగా.. కృష్ణంరాజుకు ఓ పులి ఫ్యాన్ ఉందట. రీల్ ఫైట్ లో రియల్ పులితో తలపడిన ఆయన.. దానిని మచ్చిక చేసుకున్నారట. గతంలో కృష్ణంరాజు తన భార్య శ్యామలాదేవితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి-పులులకి ఉన్న సంబంధం గురించి చెప్పారు. "ఓ సారి నేను వేటకి వెళ్ళినప్పుడు పులి నా మీద అటాక్ చేసింది. నా వెనకాల నుంచి ఒక్క పరుగుతో ముందుకు వెళ్లింది. తప్పించుకున్నాను. నాకు తెలిసి పులి మహా పిరికిది. పులిని ఎవరైనా అటాక్ చేస్తారనుకుంటేనే అది కూడా అటాక్ చేస్తుంది. లేకపోతే చేయదు" అని చెప్పారు.
పక్కనున్న భార్య శ్యామలాదేవి.. మీకు ఓ పులి ఫ్యాన్ కదా అని అనగా.. ఆ స్టోరీనీ చెప్పారు. "కటకటాల రుద్రయ్య సినిమాలో పులితో ఫైట్ సీన్ కోసం ఓ పులిని తీసుకొచ్చారు. ఫస్ట్ టైమ్ దాని మెడ పట్టుకుంటే విసిరికొట్టింది. దెబ్బకి ఎగిరి పడ్డాను. తర్వాత దాని మెడ దగ్గర నిమురుతూ మచ్చిక చేసుకున్నాక.. నాతో ఫ్రెండ్లీ అయింది. అదే పులిని ఏడాది తర్వాత మరో సినిమా కోసం తీసుకురాగా.. నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చింది" అని కృష్ణంరాజు తెలిపారు.
Next Story