Mon Dec 23 2024 14:05:20 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : చిరంజీవి వివరణ కోరిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి..
మన్సూర్, త్రిష వివాదంలో విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి.. చిరంజీవి కూడా తమ వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
Chiranjeevi : ఇటీవల తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ త్రిష పై చేసిన కామెంట్స్ ని చిరంజీవి ఖండిస్తూ ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవితో పాటు మాళవిక మోహనన్, చిన్మయి, కుష్బూ, లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, నితిన్ కూడా త్రిషకి సపోర్ట్ గా నిలుస్తూ మన్సూర్ పై అసహనం వ్యక్తం చేశారు.
మన్సూర్ చేసిన వ్యాఖ్యలకు జాతీయ మహిళా కమిషన్ మన్సూర్ పై కేసు నమోదు చేయడం, దక్షిణ భారత నటీనటుల సంఘం మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్రిషకు క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులు పంపడం జరిగింది. మొదట క్షమాపణలు చెప్పడానికి మన్సూర్ నిరాకరించినా.. చివరికి సారీ చెప్పాడు. కానీ ఆ తరువాత తన పరువుకి భంగం కలిగించేలా త్రిష, కుష్బూ, చిరంజీవి ప్రవర్తించారంటూ వారి పై మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు.
తాజాగా ఆ కేసుని విచారించిన న్యాయమూర్తి మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. "పబ్లిక్ లో ఒక మహిళ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ పబ్లిక్ లో ఎలా మాట్లాడాలో తెలుసని చెప్పి ఆ మాటల్ని సమర్ధించుకోవడం, తరుచు వివాదాల్లో నిలుస్తూ కూడా అమాయకుడినని వాదనలు చేయడం.. ఇలాంటి మన్సూర్ ప్రవర్తనని న్యాయమూర్తి తప్పుబట్టారు. అసలు కేసు నమోదు చేయాల్సింది మన్సూర్ కాదు. మన్సూర్ పై త్రిష కేసు నమోదు చేయాలి అంటూ మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం.
మన్సూర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వీడియో (అన్కట్ వీడియో) కోర్టులో హాజరుపరచాలని కోరింది. అలాగే చిరంజీవి, త్రిష, ఖుష్బూ కూడా తమ వివరణలు ఇవ్వాలని న్యాయమూర్తి తెలియజేశారు. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 22న జరగనుంది. కోర్ట్ తీర్పుతో మన్సూర్ కి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.
ఇంతకీ మన్సూర్ త్రిష పై చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. కెరీర్ లో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ లో నటించానని, ఆ సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాడిని, అయితే 'లియో' సినిమాలో త్రిషతో అలాంటి సీన్ లేనందుకు చాలా ఫీల్ అయ్యాను" అంటూ మాట్లాడారు. ఆ తరువాత మాటల్ని సమర్ధించుకుంటూ మన్సూర్ ఇలా చెప్పుకొచ్చారు.. తనవద్దకు రేప్ సీన్స్ తో ఉండే పాత్రలే ఎక్కువ వస్తుండడంతో లియోలో కూడా అదే తరహా పాత్రని అనుకున్నారట. కానీ సినిమాలో అసలు తనకి త్రిష మధ్య సన్నివేశం లేకపోవడంతో బాధపడ్డానంటూ చెప్పుకొచ్చారు.
Next Story