అసలు మణికర్ణిక రిలీజ్ అవుతుందా ?
సౌత్ లో మంచి పేరు తెచ్చుకుని బాలీవుడ్ కి వెళ్లి సినిమాలు తీసి ఇండియా వైడ్ ఫేమస్ అవ్వాలని ఏ దర్శకుడికి ఉండదు చెప్పండి? ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ, మురుగదాస్, పూరి జగన్నాథ్ ఇలా చాలామంది సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ కి వెళ్లి సినిమాలు తీసిన వాళ్లే. అయితే వారు సక్సెస్ అయ్యారో లేదో పక్కన పెడితే..ఈ జాబితాలో డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నాడు. ఈయన బాలీవుడ్ కి వెళ్లి అక్షయ్ కుమార్ తో ‘గబ్బర్’ అనే సినిమా తీసాడు.
ఇది ‘ఠాగూర్’ రీమేక్ అయిన ఆ చిత్రం అంతగా ఆడలేదు. కానీ అయన ఏమి నిరాశ చెందకుండా కంగనా రనౌత్ తో వీర నారి ఝాన్సీ లక్ష్మీభాయి కథతో ‘మణికర్ణిక’ తీసాడు. ఈ చిత్రాన్ని రెండు పెద్ద నిర్మాణ సంస్థలు టేకప్ చేశాయి. అయితే ఈ చిత్రం షూటింగ్ సమయంలో చాలానే ఇబ్బందులు తలెత్తాయి. షూటింగ్ సరిగా జరగపోవడం.. అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడం..రిలీజ్ డేట్ ఇంకా ఫైనలైజ్ చేయకపోవడం..మధ్యలో కొన్ని సార్లు రీషూట్లకు వెళ్లడం ఇలా చాలానే జరిగాయి.
అయితే చివరికి ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఆగస్టు మధ్యలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని అన్నారు కానీ.. క్రిష్ పోస్ట్ ప్రొడక్షన్ సంగతి వదిలేసి.. హైదరాబాద్ లో ఎన్టీఆర్ బయోపిక్ లో లీనం అయ్యిపోయాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం నిర్మాతలకు విడిచిపెట్టి వచ్చేసినట్టు తెలుస్తుంది. మరి క్రిష్ ఇలా ఎందుకు చేసాడో ఎవరికి అర్ధం అవ్వడంలేదు. హీరోయిన్ కంగనాతో, నిర్మాతలతో అతడికి అభిప్రాయ భేదాలున్నట్లు చెబుతున్నారు. సినిమా అసలు రిలీజ్ అవుతుందా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.