Sun Dec 22 2024 14:58:46 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలి : చిరంజీవి
తల్లి అంజనాదేవి, భార్య సురేఖలపై ప్రశంసల వర్షం కురిపించారు. అమ్మవల్లే మహిళా పక్షపాతిగా మారినట్లు తెలిపారు. నేను సక్సెస్ఫుల్ హీరోగా నిలవడానికి సురేఖనే ..
హైదరాబాద్ : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినీ పరిశ్రమలో తాను నిలదొక్కుకోవడంలో సురేఖ అందించిన సహకారం మరువలేనిదని చిరంజీవి పేర్కొన్నారు. ఇంటి బాధ్యతలన్నీ భార్య సురేఖ తీసుకోవడంతోనే తాను సినిమాలపై పూర్తిగా దృష్టి సారించి, నేడు ఈ స్థాయికి ఎదిగినట్లు చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, ఆయన భార్య సురేఖ, సోదరి పాల్గొని సినీ పరిశ్రమకు చెందిన మహిళా కార్మికురాళ్లకు చీరలు అందించి, సత్కరించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తల్లి అంజనాదేవి, భార్య సురేఖలపై ప్రశంసల వర్షం కురిపించారు. అమ్మవల్లే మహిళా పక్షపాతిగా మారినట్లు తెలిపారు. "ఒక కుటుంబంలో మహిళలలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. చిన్నతనంలో నాకోసం అమ్మ ఎంతో కష్టపడ్డారు. ఆమె కారణంగానే నేను మహిళా పక్షపాతిగా మారాను అని చెప్పాడు. ఇక నేను సక్సెస్ఫుల్ హీరోగా నిలవడానికి సురేఖనే ప్రధాన కారణం. ఇంట్లో నా బాధ్యతలన్నీ తనే తీసుకుంది. దీంతో సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాను. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక మహిళ కచ్చితంగా ఉంటుందనడానికి సురేఖ మరో నిదర్శనం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా.. అంతరిక్షంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒలింపిక్స్ స్థాయికి ఎదుగుతున్నారు. మహిళల సాధికారత కోసం అందరూ కృషి చేయాలి. ప్రతి ఇంట్లో అమ్మ, సోదరి సాధికారత కోసం అందరూ పాటుపడాలి. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలి" అని చిరంజీవి తెలిపారు.
Next Story