Mon Dec 23 2024 07:58:33 GMT+0000 (Coordinated Universal Time)
జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పారితోషికం తీసుకున్నదీ బ్యాంకు ఖాతాలే చెప్తాయి: రోజా
ఈ రోజుల్లో మామూలు యాంకర్లు, చిన్న నటులు సైతం కారు కొంటున్నారు..
ఏపీ మంత్రి రోజా కొద్ది రోజుల కిందట కొత్త కారు కొన్న సంగతి తెలిసిందే..! రూ.1.50 కోట్లతో బెంజ్ కారు కొన్నారు. తన కుమారుడు కౌశిక్ కోసమే ఈ కారును కొన్నానని తెలిపారు. మంత్రి రోజా కారును కుమారుడితో కలిసి ఆవిష్కరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో పై టీడీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శలు గుప్పించింది. మంత్రి గారికి అపాయింట్మెంట్ లో బాగానే వస్తున్నట్టు ఉన్నాయి.. బాగానే వెనకేసారు.. అంటూ రోజా వీడియోపై టీడీపీ కామెంట్ చేసింది. రోజా కొన్న జీఎల్ఎస్- 400డీ బెంజ్ కారు విలువ రూ.1.5 కోట్లని కూడా టీడీపీ వెల్లడించింది.
తాను కొత్త కారు కొంటే టీడీపీ నేతలు 'రుషికొండ గిఫ్ట్' అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. ఈ రోజుల్లో మామూలు యాంకర్లు, చిన్న నటులు సైతం కారు కొంటున్నారు.. ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నేను కారు కొనడం తప్పన్నట్టుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు కొనాలంటే లోన్ తీసుకుంటే సరిపోతుందని, తాను కారు కొనడం గొప్పేమీ కాదని అన్నారు. ఏది అమ్మినా, ఏది కొన్నా ఎంతో పారదర్శకతతో ఉంటానని స్పష్టం చేశారు. చదువురాని వారికి కూడా తాను సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని, తాను జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పారితోషికం తీసుకున్నదీ బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలిస్తే అర్థమవుతుందని రోజా చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలకు ఏదీ దొరక్క ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని రోజా విమర్శించారు.
Next Story