నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా మూవీ రివ్యూ
బ్యానర్: రామలక్ష్మి సినీ క్రియేషన్స్
నటీనటులు: అల్లు అర్జున్, అను ఇమ్మాన్యువల్, సీనియర్ అర్జున్, హరీష్ ఉత్తమన్, ఠాకూర్ అనూప్ సింగ్,బోమన్ ఇరానీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, నదియా, శరత్ కుమార్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ -శేఖర్
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, సుశీల్ చౌదరి
ఎడిటర్: కోటగిరి
నిర్మాతలు: లగడపాటి శ్రీధర్, నాగబాబు
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: వక్కంతం వంశీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే అభిమానులలో ప్రత్యేకమైన క్రేజ్. ఎప్పుడూ ప్రత్యేకతని, స్టైలిష్ ని ఇష్టపడే అల్లు అర్జున్ తనకున్న క్రేజ్ తో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ తేగల సత్తా ఉన్న హీరో. 'రేసు గుర్రం, సరైనోడు, దువ్వాడ జగన్నాథం' సినిమాలతో నటుడిగా మంచి పరిణితి చూపించిన అల్లు అర్జున్ 'డీజే' సినిమాలో బ్రాహ్మణుడిగా, డీజే గా అదరగొట్టేసే పెరఫార్మెన్స్ చేశాడు. 'దువ్వాడ జగన్నాథం'లో అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా పంచె కట్టి వంటవాడిగా కనబడితే... డీజే గా మాంచి స్టైలిష్ పెరఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ సినిమాలో అలా అదరగొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఆర్మీ ఆఫీసర్ పాత్రలోకి మారిపోయాడు. రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో దేశభక్తి నేపథ్యంలో ఉన్న 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' అనే పవర్ ఫుల్ సినిమా చేసాడు అల్లు అర్జున్. తన చిన్న మావయ్య నాగబాబు, సినిమాలంటే ఫ్యాషన్ ఉన్న లగడపాటి శ్రీధర్ లు నిర్మాణంలో అల్లు అర్జున్ - అను ఇమ్మాన్యువల్ తో రొమాన్స్ చేసాడు. మరి నా 'పేరు సూర్య' ఫస్ట్ ఇంఫాక్ట్ నుండే సినిమాపై భారీ అంచనాలు అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఉన్నాయి. భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారమే ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా కి ప్రేక్షకులు ఎలాంటి తీర్పునిస్తారో.... వరుస విరాజయాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ కి 'నా పేరు సూర్య' సినిమా ఎలాంటి విజయాన్ని అందించింది.. అలాగే కొత్తగా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమవుతున్న వక్కంతం వంశీ 'నా పేరు సూర్య' తో ఎలాంటి హిట్ కొట్టాడో అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
మిలిటరీ క్యాంప్ ట్రైనింగ్ లో ఉన్న సోల్జర్ సూర్య(అల్లు అర్జున్). అయితే సోల్జర్ గా వున్నా సూర్య కి కోపం ఎక్కువ. ఆ కోపంతోనే అందరితో గొడవ పడుతూ ఉంటాడు. అయితే అదే కోపంతో టెర్రరిస్ట్ ని కాల్చి చంపడంతో సూర్య ని సస్పెండ్ చేస్తాడు ఆర్మీ ఆఫీసర్ శ్రీవాత్సవ్(బోమన్ ఇరానీ).అయితే మల్లి ఆర్మీలోకి అడుగుపెట్టాలంటే ప్రముఖ సైకాలజి యూనివర్సిటీ డీన్ రామ కృష్ణంరాజు(అర్జున్)సంతకం తీసుకుని రమ్మని సూర్యకి చెబుతాడు శ్రీవాత్సవ్. అయితే రామ కృష్ణ రాజు ఎవరో అక్కడు. సూర్య చిన్నప్పుడే గొడవ పడి విడిపోయిన సూర్య తండ్రి. ఆ సంతకం కోసం వైజాగ్ వస్తాడు సూర్య. అయితే తాను సంతకం పెట్టాలంటే 21 రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని కండీషన్ పెడతాడు కృష్ణంరాజు. మరి సూర్య తన ఉద్యోగం కోసం కృష్ణం రాజు చెప్పినట్టుగా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడా? కోపాన్ని దిగమింగుకుని ఆ సంతకం చేయించుకుంటాడా? అసలు కృష్ణ రాజు తన తండ్రి అని సూర్య తెలుసుకుంటాడా? అనేది నా పేరు సూర్య మిగతాకథ.
నటీనటులు:
అల్లు అర్జున్ ఎప్పటిలాగే ఎనర్జీతో రెచ్చిపోయాడు. దేశం మీద భక్తి ఉన్న యువకుడిగా, కోపాన్ని దిగమింగలేని కుర్రాడిగా చాలా మెచ్యూర్డ్ పెరఫార్మెన్స్ చేసాడు. సూర్య పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టేసాడు. ఆర్మీ ఆఫీసర్ గా అల్లు అర్జున్ స్టైలిష్ నటనతో ఆకట్టుకున్నాడు. కొత్త హెయిర్ స్టయిల్, ఆర్మీ డ్రెస్, మొహంలోని ఆగ్రహావేశాలు ఇలా ప్రతి ఒక్క విషయంలో అల్లు అర్జున్ అదరగొట్టేసాడు. యాంగ్రీ ఆర్మీ సోల్జర్ గా పర్ ఫెక్ట్ ఛాయస్ అనిపించుకున్నాడు. ఇక పాటల్లో అల్లు అర్జున్ ఎప్పటిలాగే అదరగొట్టే డాన్స్ లతో ఇరగదీసాడు. కొత్త స్టెప్పులతో బన్నీ డాన్స్ అద్భుతంగా చేసాడని చెప్పాలి. లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో, క్యాప్ ట్రిక్స్ లో అల్లు తనదైన స్టయిల్లో రెచ్చిపోయాడు. అలాగే హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ తో చేసిన రొమాంటిక్ సీన్స్ లోను అల్లు అర్జున్ నటన బావుంది. ఇక నాకు ఇమ్మాన్యువల్ మాత్రం గ్లామర్ షో కి బాగా పనికొచ్చింది. పాటల్లో అందాల ఆరబోతలో అను ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కాకపోతే నటనకి పెద్దగా స్కోప్ లేని పాత్రలో అను ఇమ్మాన్యువల్ కి మరోమారు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఇక అల్లు అర్జున్ తండ్రి పాత్రలో సీనియర్ అర్జున్ ప్రొఫెసర్ పాత్రలో పర్వాలేదనిపించారు. కానీ అర్జున్ ని వాడుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఇక విలన్ గా శరత్ కుమార్ ఎందుకున్నాడో అర్ధం కాదు. అలాగే కామెడీ పాత్రల్లో హైలెట్ అయిన వెన్నెల అసలు ఈ సినిమాలో కామెడీ పరంగా మెప్పించలేకపోయాడు. అలాగే మరో సీనియర్ నటి నదియా కి అస్సలు ప్రధాన్యత లేని పాత్ర దక్కింది. మిగతా నటీనటులు కూడా ఓ అన్నంత ప్రాధాన్యం లేని పాత్రల్లో నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
నా పేరు సూర్య కి మ్యూజిక్ అందించిన విశాల్ -శేఖర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సంగీతం మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. ఒక్క లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో మాత్రమే ఆకట్టుకునేలా ఉంది. అసలు అల్లు అర్జున్ డాన్సులు కనక వీటికి తోడవ్వకపోతే ఇవి జస్ట్ యావరేజ్ అనిపించే సాంగ్సే. బ్యాక్ గ్రౌండ్ తో మాత్రం కాస్త పర్వాలేదనిపించారు. ఇక ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజీవ్ రవి కెమెరా పనితనం గురించి. ఆర్మీ క్యాంపు, వైజాగ్ బ్యాక్ డ్రాప్ ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేని నేపధ్యాలని వేరు చేసి దర్శకుడి అంచనాలకు తగ్గట్టు సింక్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సాంగ్స్ లోని విజువల్స్ ని అద్భుతంగా తెరకెక్కించిన రాజీవ్ రవి యాక్షన్ సీన్స్ లో సైతం తనదైన మార్క్ చూపించాడు. ఇక కోటగిరి ఎడిటింగ్ పర్వాలేదనిపించినా... కొన్ని చోట్ల కత్తెర వేయాల్సిన సీన్స్ ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.
విశ్లేషణ:
ఈ సినిమా కథని వక్కంత వంశీ కేవలం అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం అల్లు అర్జున్ పాత్ర తప్ప మారేది సినిమా లో కనబడదు. అలా డిజైన్ చేసాడు హీరో పాత్రని. సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైనా ఈ రైటర్ వక్కంతం తానూ రాసుకున్న కథని సినిమాగా మలచడంలో విఫలమయ్యాడు. అసలు కమర్షియల్ హీరోకు ఉండాల్సిన మసాలాలు ఇందులో కూడా చేర్చాలని చేసిన ప్రయత్నమే కొంచెం తేడా కొట్టించింది. దేశభక్తి కలిగిన బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీస్ వీలైనంత సీరియస్ గా ఎమోషనల్ గా ఉంటేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. మాములుగా మాస్ ని టార్గెట్ చేసో లేక ఫాన్స్ ఫీల్ అవుతారనో ఏదైనా ఇరికించే ప్రయత్నం చేస్తే మాత్రం అవుట్ పుట్ లో మార్పు కనిపిస్తుంది. నా పేరు సూర్యలో జరిగింది అదే. మొదటి అరగంట హై వోల్టేజ్ యాక్షన్ అనే హామీ ఇచ్చిన వంశీ అది అవ్వగానే రొటీన్ ట్రాక్ లోకి పడిపోవడం కొంత ప్రభావం చూపించింది. ఇక స్క్రీన్ ప్లే తో కూడా వక్కంతం ఎలాంటి మ్యాజిక్ చెయ్యలేకపోయాడు. స్లోగా ఉన్న స్క్రీన్ ప్లే విసుగు తెప్పిస్తుంది. సింక్ కానీ ప్రేమ కథ, అది మళ్లీ బ్రేక్ అప్ ఇదంతా అవసరమా అనిపించడం స్క్రీన్ ప్లే లోపమే. అలాగే నా పేరు సూర్య లో యుద్ధ నేపధ్యాన్ని ఊహించకుంటే అది మాత్రం ఎక్కడా మచ్చుకైనా లేకపోవడం ఈ సినిమాకున్న అతిపెద్ద మైనస్. ఇక క్లైమాక్స్ హడావిడిగా చుట్టేసి లాజిక్ కి దూరంగా విలన్ అంత సులభంగా మారినట్టు చూపించడం అంత కన్విన్సింగ్ గా లేదు. మరీ సినిమాటిక్ గా ఉండటం కొంత డ్రామా నడిపిన ఫీలింగ్ కలగటంతో నాటకీయంగా ముగుస్తుంది. అలాగే సీనియర్ హీరో అర్జున్ ని ఉపయోగించుకోవడంలో విఫలమవడమే కాదు.. భారీ స్టార్ క్యాస్ట్ ని కూడా వంశీ అనుకున్నంత గా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక చివరిగా ఫస్ట్ హాఫ్ లో అవసరం లేని ప్రేమ కథతో టైం వేస్ట్ చేసిన వక్కంతం వంశీ సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించారు.
ప్లస్ పాయింట్స్: అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: కథ, కథనం, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, కామెడీ లేకపోవడం, ఫస్ట్ హాఫ్
రేటింగ్: 2 .25 /5