Mon Dec 23 2024 06:35:55 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ సినిమా లాస్.. ఎన్టీఆర్ పిలిచి ధైర్యం ఇచ్చారు.. నిర్మాత నాగవంశీ
పవన్ కళ్యాణ్ సినిమా లాస్ ఎదుర్కొన్న తమకి ఎన్టీఆర్ పిలిచి ధైర్యం ఇచ్చారంటూ నిర్మాత నాగవంశీ కామెంట్స్ చేశాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది.. వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ తరువాత వీరి కలయికలో మూడో చిత్రంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘అజ్ఞాతవాసి' (Agnathavasi). ఇది పవన్ కళ్యాణ్ 25వ సినిమా కూడా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో నిర్మాతలు కూడా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో భారీ నష్టాలు వచ్చాయి.
హారికా హాసిని క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. ఇక ఈ బ్యానర్ నుంచి వచ్చిన నిర్మాత నాగవంశీ.. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్నాడు. తాజాగా నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా, అక్కడ మాట్లాడుతూ.. అజ్ఞాతవాసి పరాజయం తరువాత జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులకు తెలియజేశాడు.
"ఆజ్ఞాతవాసి ప్లాప్ తో రెండు మూడు నెలలు పాటు చాలా డల్ అయిపోయాము. దానిని నుంచి బయటకి రాలేకపోయాము. అయితే అప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో 'అరవింద సమేత వీర రాఘవ' అనౌన్స్ చేసేశాం. దీంతో ఎన్టీఆర్ పిలిచి దైర్యం ఇచ్చారు. ఇంకెన్ని రోజులు ఇలా ఉంటారు. ఈ సినిమా మొదలు పెట్టి ఇదే సంవత్సరంలో హిట్టు కొడదాం పదండి అని ధైర్యం చెప్పారు. జనవరిలో అజ్ఞాతవాసి ప్లాప్ అందుకున్న మేము అదే సంవత్సరం అక్టోబర్ లో ఎన్టీఆర్ అరవింద సమేతతో హిట్ అందుకున్నాము" అని నాగవంశీ వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా నాగవంశీ నిర్మించిన 'మ్యాడ్' అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ బామ్మర్ది 'నార్నె నితిన్' ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లోనే నాగవంశీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు.
Next Story