మామపై కోడలు గెలిచింది..!
సమంత నాగ చైతన్య ని పెళ్ళాడి అక్కినేని ఇంటికోడలిగా నాగ్ ఇంట అడుగుపెట్టింది. పెళ్లి నాటికి సమంత చేస్తున్న సినిమాలన్నీ పెళ్లి తర్వాత విడుదలై ఘన విజయం సాధించాయి. రామ్ చరణ్ తో కలిసి నటించిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా విజయంతో ఉన్న సమంత మళ్లీ మహానటి తో మధురవాణి గా చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత మూడు రోజులకే కోలీవుడ్ లో ఇరుంబు తిరై తో హిట్ అందుకుంది. అలాగే మహానటి హిట్ కొట్టాక మళ్ళీ 20 రోజులకే అంటే తెలుగులో అభిమన్యుడు సినిమా జూన్ 1 న విడుదలై విజయం సాధించింది. అభిమన్యుడు సినిమాని విశాల్ తో కలిసి హిట్ కొట్టింది సమంత.
పెళ్లి తర్వాత అన్నీ మంచి రోజులే...
మరి సమంత సక్సెస్ ట్రాక్ ఎలా వుంది అంటే.. మామతో పోటీకి సై అనడమే కాదు.. ఆ పోటీలో అమ్మడు హిట్ కొట్టేసింది. మామ నాగార్జునతో సమంత ఎంత ప్రేమగా, క్లోజ్ ఉంటుందో వారు సోషల్ మీడియాలో చేసుకునే చాటింగ్ చూస్తే తెలిసిపోతుంది. అయితే మామాకోడళ్లు ఇప్పుడు తాము నటించిన సినిమాలతో పోటీకి సై అన్నారు. నాగార్జున ఆఫీసర్ మూవీ తో బరిలోకి దిగగా.. విశాల్ తో కలిసి సమంత అభిమన్యుడు సినిమాతో బరిలోకి దిగింది. రసవత్తరంగా వున్న ఈ పోటీలో కోడలు సమంతానే పై చెయ్యి సాధించింది. నాగార్జున ఆఫీసర్ సినిమాకి అటు క్రిటిక్స్ నుండి ,ఇటు ప్రేక్షకుల నుండి కూడా పాస్ మార్కులు పడలేదు. కానీ సమంత అభిమన్యుడు మాత్రం క్రిటిక్స్ నుండి ఫుల్ మార్కులు వేయించుకుంది. అభిమన్యుడు సినిమాలో సైక్రటిస్ట్ గా నటించిన సమంత పెళ్లి తర్వాత మళ్లీ సూపర్ హిట్ అందుకుంది. ఇటు తెలుగులోనూ అటు కోలీవుడ్ లోనూ పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతూ హీరోయిన్స్ కి పెళ్లి తర్వాత కెరీర్ ఉండదు అనే టాక్ ని బ్రేక్ చేసింది సమంత... సో అలా మామపై కోడలు పై చెయ్యి సాధించింది.