Sat Jan 11 2025 20:11:00 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్యను మళ్లీ దూరం పెట్టారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీకి నందమూరి బాలకృష్ణకు ఆహ్వానం లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీకి నందమూరి బాలకృష్ణకు ఆహ్వానం లేదు. ఆయన ఈ చర్చలకు దూరంగా ఉన్నారు. బాలయ్య కాదన్నారా? అసలు బాలయ్యను టాలీవుడ్ కలుపుకుని పోవడం లేదా? అన్న చర్చ బాలయ్య అభిమానుల్లో జరుగుతుంది. టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లు ప్రముఖులు. బాలకృష్ణ ఇప్పటికీ ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే బాలయ్య నటించిన అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది.
తెలంగాణలోనూ....
అయితే టాలీవుడ్ సమస్యలపై చర్చించడానికి తొలి నుంచి బాలయ్య ను దూరంగా పెడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసినప్పుడు కూడా బాలకృష్ణ హాజరుకాలేదు. తర్వాత బాలయ్య దీనిపై ఫైర్ అయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న బాలకృష్ణ తానే ఈ సమావేశానికి హజరు కాలేనని చెప్పారా? లేదా? అసలు ఆయనకు ఆహ్వానం లేదా? అన్నది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అధికారంలో ఉన్నప్పుడు..
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే బాలకృష్ణకు టాలీవుడ్ పెద్ద పీట వేసేది. అయితే ఇప్పుడు అధికారంలో లేకపోవడం వల్లనే బాలయ్యను విస్మరించారన్న వాదన వినపడుతుంది. దీనిని కొందరు టాలీవుడ్ ప్రముఖులు తప్పుపడుతున్నారు. టిక్కెట్ల రేట్లను పెంచడాన్ని బాలయ్య వ్యతిరేకించారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించుకోవడానికి అందరూ ఏకంగా పనిచేయాలని బాలయ్య గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
Next Story