Mon Dec 23 2024 03:05:21 GMT+0000 (Coordinated Universal Time)
తారకరామ థియేటర్ పునఃప్రారంభం.. ఈ థియేటర్ కు ఓ చరిత్ర ఉంది : బాలకృష్ణ
తారకరామ థియేటర్ తనకు వ్యక్తిగతంగా సెంటిమెంట్ అని, ఈ థియేటర్లో రిలీజైన సినిమాలు ఘనవిజయాలను అందుకున్నాయని..
నందమూరి కుటుంబానికి చెందిన తారకరామ థియేటర్.. ఇప్పుడు ఏసియన్ తారకరామగా మారింది. కాచిగూడ క్రాస్ రోడ్స్ లో కొత్తహంగులతో తీర్చిదిద్దిన ఈ థియేటర్ ను నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం ప్రారంభించారు. ప్రముఖ ఏసియన్ సంస్థ ఈ థియేటర్ ను తీసుకుని మరమ్మతులు చేసింది. పునర్నిర్మాణం అనంతరం ఏసియన్ తారకరామగా మారింది. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. తారకరామ థియేటర్ కు ఓ చరిత్ర ఉందన్నారు. 1978లో దీన్ని ప్రారంభించామని.. 'సలీం అనార్కలి' సినిమాతో ఇది మొదలయిందని చెప్పారు. కొన్ని కారణాల వల్ల థియేటర్ మూతపడిందని, 1995లో పునఃప్రారంభించామని బాలయ్య తెలిపారు. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ, హంగులతో మూడోసారి అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.
తారకరామ థియేటర్ తనకు వ్యక్తిగతంగా సెంటిమెంట్ అని, ఈ థియేటర్లో రిలీజైన సినిమాలు ఘనవిజయాలను అందుకున్నాయని తెలిపారు. తన కుమారుడికి మోక్షజ్ఞ తారకరామ తేజ అనే పేరుని నాన్నగారు ఇక్కడే పెట్టారని బాలయ్య గుర్తుచేసుకున్నారు. కాగా.. ఈ నెల 16న అవతార్ 2 సినిమాతో థియేటర్లో సినిమా ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. ధమాకా, సంక్రాంతికి విడుదల కానున్న 'వీరసింహా రెడ్డి'ని కూడా ఇందులో ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా మరమ్మతులు నిర్వహించిన ఈ థియేటర్లో 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్ ను అమర్చారు. 975 సీటింగ్ కెపాసిటీని 590కి తగ్గించారు. రిక్లైనర్ సీట్లను, సోఫాలను ఏర్పాటు చేశారు.
Next Story