అంతా ఓకే గానీ... ఇంకా శాటిలైట్ అవ్వలేదా..?
ఈ మధ్యన ఏదైనా సినిమా ట్రైలర్ లేదా పాటలు విడుదలయ్యాక సినిమా మీద క్రేజొస్తే... లేదంటే ఆ సినిమా హీరో గత సినిమా హిట్ అయినా... ఆ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు శాటిలైట్స్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. పలు ఛానల్స్ ఆ సినిమాని ఎగరేసుకుపోవడానికి కాచుకుని కూర్చుంటున్నాయి. అయితే పోటాపోటీగా ఉన్న ఛానల్స్ మధ్యన డీల్ సెట్ అయితే సినిమా విడుదలకు ముందే శాటిలైట్ హక్కులు అమ్మేస్తున్నారు నిర్మాతలు. చిన్న సినిమాలుగా తెరకెక్కిన కొన్ని సినిమాలకు ఆ శాటిలైట్స్ హక్కుల ద్వారానే పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చేసుకుంటున్నాయి. అయితే తాజాగా మంచి టాక్ వచ్చిన ఒక సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడు పోలేదట.
యావరేజ్ టాక్ వచ్చినా...
పోయిన గురువారం సుధీర్ బాబు హీరోగా నన్ను దోచుకుందువటే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ.. థియేటర్స్ లో సరైన సినిమా లేక నన్ను దోచుకుందువటే కి కలెక్షన్స్ పర్వాలేదన్నారు. సుధీర్ బాబు ఓన్ గా ప్రొడక్షన్ హౌస్ పెట్టి.. అందులో మొదటగా తానే హీరోగా నన్ను దోచుకుందువటే సినిమాని నిర్మించాడు. అలాగే ఈ చిత్రానికి దర్శకుడు మాత్రమే కొత్తవాడు కాదు.. ఆఖరుకి కన్నడ నుండి ఒక కొత్త భామ నాభ నటాషాని తెలుగు తెరకు పరిచయం చేసాడు. మరి సినిమాకి యావరేజ్ టాక్ ఇచ్చినా.. ప్రేక్షకులు పర్వాలేదనిపించారు. సమ్మోహనం హిట్ తో వున్న సుధీర్ బాబు నన్ను దోచుకుందువటేకి విడుదలకు ముందే మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
భారీగా డిమాండ్ చేస్తుండటంతో...
మరి అలాంటి సినిమాకి ఇంకా శాటిలైట్ బిజినెస్ క్లోజ్ కాలేదనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. మాములుగా సినిమా పర్వాలేదంటేనే ఆ సినిమా శాటిలైట్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ఈ రోజుల్లో కాస్తో కూస్తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నన్ను దోచుకుందువటే శాటిలైట్స్ ఇంకా అమ్ముడు కాకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే నన్ను దోచుకుందువటే సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడు కాకపోవడానికి కారణం.. హీరో సుధీర్ బాబే అంటున్నారు. తాను పెట్టిన పెట్టుబడిని ఈ శాటిలైట్ హక్కుల ద్వారానే లాగాలని సుధీర్ బాబు శాటిలైట్ హక్కులకు భారీగా డిమాండ్ చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఇంకా అమ్ముడు పోలేదని టాక్ అయితే నడుస్తుంది.