Mon Dec 23 2024 10:40:43 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు మళ్లీ మోక్షమెప్పుడో ?
ఎన్టీఆర్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల సమయంలో ఇచ్చేది. ఈ అవార్డుతో..
తెలుగు సినీ పరిశ్రమకు ఒక గుర్తింపు తెచ్చి, తెలుగువారికంటూ ఓ గుర్తింపు ఇచ్చి, ప్రపంచంలో తెలుగు వాళ్ళు అంటే గుర్తుపట్టేలా చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే. హీరోగా కొన్ని వందల సినిమాల్లో మెప్పించి, ముఖ్యమంత్రిగా కొన్ని కోట్ల మంది ప్రజలకు సేవ చేసిన ఘనత ఆయనది. సినిమాల్లో ఆయన వేసిన పాత్రలు, సాధించిన రికార్డులు ఎవ్వరూ సాధించలేరు. ఆయన టాలెంట్ ని ఎవరూ అందుకోలేరు. మే 28న ఆయన శతజయంతి. గత సంవత్సర కాలంగా తెలుగు ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.
అయితే తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన ఎన్టీఆర్ పేరు మీద ఆయన మరణించాక ఏపీ ప్రభుత్వం 1996లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని స్థాపించారు. ఎన్టీఆర్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల సమయంలో ఇచ్చేది. ఈ అవార్డుతో పాటు రూ.5 లక్షల ప్రైజ్ మనీ కూడా ఇచ్చేవాళ్ళు. దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన ప్రముఖులలో ఒక్కరికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని ఇచ్చేవారు. ఈ అవార్డు స్థాపించిన మొదటి సారి అక్కినేని నాగేశ్వరరావుకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని అందించారు. ఆ తర్వాత దిలీప్ కుమార్, శివాజీ గణేశన్, లతా మంగేష్కర్, భానుమతి రామకృష్ణ, హ్రిషికేష్ ముఖర్జీ, డాక్టర్ రాజ్ కుమార్, కృష్ణ, ఇళయరాజా, అంబరీష్, వహీదా రెహమాన్, దాసరి నారాయణ రావు, జామున, బి.సరోజాదేవి, శారదా, అమితాబ్ బచ్చన్, బాలసుబ్రహ్మణ్యం, హేమమాలిని, కమల్ హాసన్, రాఘవేంద్ర రావులు ఎన్టీఆర్ అవార్డుని అందుకున్నారు. చివరిసారిగా 2016లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని నటుడు రజినీకాంత్ అందుకున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు నంది అవార్డులతో పాటు ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని ఇచ్చింది. నంది అవార్డ్స్ ఆపేసిన తర్వాత నుంచి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా ఆపేశారు. ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇవ్వాలని ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా ఇవ్వాలని ఎన్టీఆర్ ఫ్యామిలీ కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకి మళ్ళీ ఎప్పుడు మోక్షం వస్తుందో చూడాలి. నంది అవార్డ్స్ ఇచ్చినా ఈ సారి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇస్తారో లేదో అనుమానమే.
Next Story