Mon Dec 23 2024 11:36:05 GMT+0000 (Coordinated Universal Time)
20 ఏళ్ళ తరువాత మళ్ళీ తెలుగు పదానికి జాతీయ పురస్కారం.. ఇప్పటివరకు..
ఇప్పటి వరకు బెస్ట్ లిరిక్ రైటర్ క్యాటగిరీలో ఎన్నిసార్లు తెలుగు సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిందో తెలుసా..? 1968 నుంచి బెస్ట్ లిరిక్ అవార్డుని ఇస్తూ వస్తుండగా..
ఇండియన్ ఫిలిం మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు భారత్ ప్రభుత్వం ఇచ్చే 'నేషనల్ అవార్డ్స్' (National Film Awards 2023). 2021 గాను 69వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈసారి జాతీయ పురస్కారంలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. 10 నేషనల్ అవార్డులను అందుకొని టాలీవుడ్ సంచలనం సృష్టించింది. ఇక ఈ ఏడాది దాదాపు 20 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు తెలుగు పదానికి జాతీయ పురస్కారం అందింది.
‘కొండపొలం’ సినిమాకు గాను ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ (Chandrabose).. బెస్ట్ లిరిక్ రైటర్ గా నేషనల్ అవార్డుని అందుకున్నారు. 'ధం ధం ధం' సాంగ్ కి చంద్రబోస్ ఈ అవార్డుని అందుకున్నారు. కాగా తెలుగు అక్షరానికి గతంలో 2003 లో నేషనల్ అవార్డు వరించింది. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళకి తెలుగు పదానికి జాతీయ పురస్కారం అందింది. అయితే ఇప్పటి వరకు బెస్ట్ లిరిక్ రైటర్ క్యాటగిరీలో ఎన్నిసార్లు తెలుగు సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిందో తెలుసా..?
1968 నుంచి బెస్ట్ లిరిక్ అవార్డుని ఇస్తూ వస్తుండగా.. ఇప్పటివరకు మొత్తం నాలుగు సార్లు మాత్రమే తెలుగు పదానికి గౌరవం దక్కింది. మొదటిసారి 1974లో శ్రీశ్రీ బెస్ట్ లిరిక్ రైటర్ గా నేషనల్ అవార్డుని అందుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన మన్నెం వీరుడి కథ 'అల్లూరిసీతారామరాజు' సినిమాలోని 'తెలుగువీర లేవరా' పాటకు శ్రీశ్రీ అవార్డుని అందుకున్నారు. పి ఆదినారాయణ రావు ఈ పాటకు సంగీతం అందించగా ఘంటసాల, వి రామకృష్ణ ఆలపించారు.
ఆ తరువాత మళ్ళీ 19 ఏళ్ళకు తెలుగు రచయితకు అవార్డు దక్కింది. 'మాతృదేవోభవ' సినిమాలోని 'రాలిపోయే పువ్వా' పాటకు గాను 'వేటూరి సుందరరామ్మూర్తి' బెస్ట్ లిరిక్ రైటర్ గా 1993లో జాతీయ అవార్డును అందుకున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించగా పాటని కూడా ఆయనే పాడారు. ఈ అవార్డు తరువాత మళ్ళీ 20 ఏళ్లకే తెలుగు పదానికి నేషనల్ అవార్డు వచ్చింది.
2003 లో సుద్దాల అశోక్ తేజ జాతీయ పురస్కారం అందుకున్నారు. చిరంజీవి నటించిన 'ఠాగూర్' సినిమాలోని 'నేను సైతం' పాటకు గాను సుద్దాల అవార్డుని అందుకున్నారు. మణిశర్మ ఈ పాటకి సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటని పాడారు. ఈ అవార్డు తరువాత మళ్ళీ 20 ఏళ్లకి ఇప్పుడు ‘కొండపొలం’ సినిమాలోని 'ధం ధం ధం' సాంగ్ కి చంద్రబోస్ ఈ అవార్డుని అందుకున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, దామిని భట్ల ఆలపించారు.
Next Story