Thu Dec 19 2024 17:45:37 GMT+0000 (Coordinated Universal Time)
Dasara Review : మాస్ తో మెప్పించి.. ఎమోషన్స్ తో ఏడిపించిన "దసరా"
ధరణి పాత్రలో నాని ఒదిగిపోయాడు. ప్రేమ కోసం మనసులో సంఘర్షణ పడుతూనే.. స్నేహం కోసం ప్రాణమిచ్చే యువకుడిగా..
సినిమా : దసరా
నటీనటులు : నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయికుమార్, షైన్ టామ్ చాకో, జరీనా వాహబ్ తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్
ఎడిటింగ్ : నవీన్ నూలి
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
రచన : శ్రీకాంత్ ఓదెల, జెల్ల శ్రీనాథ్, అర్జున పాతూరి, వంశీకృష్ణ
దర్శకుడు : శ్రీకాంత్ ఓదెల
విడుదల : 30.03.2023
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. ఈ యువ హీరోను ఇష్టపడనివారంటూ ఉండరు. క్లాస్, మాస్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఆయన నటనకు ఫ్యాన్స్. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న నాని.. ఈ శ్రీరామనవమికి దసరా సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెట్టాడు. మరి ఈ సినిమా నాని ఆశలను, అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
కథ విషయానికొస్తే..
1995 నేపథ్యంలో తీసిన సినిమా ఇది. సింగరేణి సమీపంలో వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ ఈ కథ సాగుతుంది. ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేష్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వెన్నెల సూరిని ప్రేమిస్తుందని తెలిసి సూరి కోసం ధరణి తన ప్రేమను వదులుకుంటాడు. రైళ్లలో బొగ్గు దొంగతనం చేయడం, తాగడం, స్నేహితులతో కలిసి తిరగడం.. ఇలా సాగిపోతుంటాయి వాళ్ల జీవితాలు. అలాంటి సమయంలో ఊరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఈ ముగ్గురి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఆ ఎన్నికల్లో సూరి బృందం రాజన్న (సాయికుమార్)కి సపోర్ట్ చేసి గెలిపిస్తుంది. ఆ తర్వాత చిన్న నంబి (షైన్ టామ్ చాకో) నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అవి ధరణి, సూరి, వెన్నెల జీవితాలపై ఎలా ప్రభావితం చేశాయన్నది తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
ధరణి పాత్రలో నాని ఒదిగిపోయాడు. ప్రేమ కోసం మనసులో సంఘర్షణ పడుతూనే.. స్నేహం కోసం ప్రాణమిచ్చే యువకుడిగా నాని నటన కట్టిపడేస్తుంది. సూరి, వెన్నెల పాత్రలకు దీక్షిత్ శెట్టి, కీర్తి సురేష్ లు ప్రాణం పోశారనే చెప్పాలి. విలన్ గా కనిపించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో చూపులతోనే భయపెట్టాడు. సముద్రఖనిని ఈ సినిమాలో కొత్త గెటప్ లో చూపించినా.. ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఊరిపెద్దగా రాజన్న పాత్రలో సాయికుమార్ సరిగ్గా సరిపోయారు. ఆయన పాత్రకు తగ్గట్టుగా జీవించారు.
పాటల విషయానికొస్తే ధూమ్ ధామ్ దోస్తాన్, చమ్కీల అంగీలేసి పాటల చిత్రీకరణ బాగుంటుంది. సంగీతంతో ఈ సినిమాపై సంతోష్ నారాయణన్ తనదైన ముద్ర వేశారు. శ్రీకాంత్ ఓదెల కి దర్శకుడిగా ఇది తొలి చిత్రమే అయినా.. చాలా అనుభవమున్న దర్శకుడిగా సన్నివేశాల్ని తీర్చి దిద్దారు. మాటలు, నిర్మాణం ఉన్నతంగా ఉంటాయి.
ప్లస్ పాయింట్స్
+ నాని, కీర్తి సురేష్ నటన
+ కథా నేపథ్యం, భావోద్వేగాలు
+ విరామం, పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు
చివరిగా ఒక్కమాటలో చెప్పాలంటే.. ధూమ్ ధామ్ "దసరా"
Next Story