Fri Nov 22 2024 14:56:45 GMT+0000 (Coordinated Universal Time)
Hi Nanna: 'హాయ్ నాన్న' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది
ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే మంచి కలెక్షన్లను దక్కించుకుంది
నేచులర్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే మంచి కలెక్షన్లను దక్కించుకుంది. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వానికి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. హాయ్ నాన్న స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. హాయ్ నాన్న సినిమా జనవరి 4వ తేదీన (2024) నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. “మీతో ఎప్పుడూ ఉండిపోవడానికి వచ్చేశారు యష్న (మృణాల్ ఠాకూర్), మహీ (కియారా ఖన్నా), విరాజ్ (నాని). హాయ్ నాన్న మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది” అని నెట్ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.
హాయ్ నాన్న సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. నాని కూతురు పాత్రను బేబి కియారా ఖన్నా పోషించారు. ఈ చిత్రంలో నాని, మృణాల్, కియారా నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే హాయ్ నాన్నా డిజిటల్ స్క్రీన్లపైకి వచ్చేస్తోంది. హాయ్ నాన్నతో నటుడిగా నేచురల్ స్టార్ మరోసారి నిరూపించుకున్నాడు. విమర్శకుల ప్రశంసలతో పాటు, టార్గెట్ ఆడియన్స్తో ఈ సినిమా బాగా క్లిక్ అయింది. హాయ్ నాన్నలో బేబీ కియారా ఖన్నా, అంగద్ బేడీ, నాజర్, జయరామ్, విరాజ్ అశ్విన్, ప్రియదర్శి కూడా కీలక పాత్రల్లో నటించారు. నేహా శర్మ, రితికా నాయక్ అతిధి పాత్రల్లో కనిపించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి (CVM) వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హాయ్ నాన్నను నిర్మించారు. హాయ్ నాన్న సినిమాని థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు జనవరి 4 నుండి నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు.
Next Story