గుంపులో గోవిందం అన్నట్టుగా...!
అసలు కొన్ని సినిమాలు ఎప్పుడు థియేటర్స్ కి వస్తాయో.. ఎప్పుడు వెళ్ళిపోతాయో ప్రేక్షకులకు కూడా తెలియని పరిస్థితి. అస్సలు క్రేజ్ లేని చిన్న సినిమాలు సమయం సందర్భం లేకుండా పొలోమని థియేటర్స్ లోకి వచ్చేస్తాయి. అసలెప్పుడు తెరకెక్కాయో కూడా ఎవరికీ తెలియదు. మరి వచ్చే శుక్రవారం బోలెడన్ని చిన్న సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. అందులో కేవలం రెండు మూడు సినిమాలు మాత్రం పబ్లిసిటీ స్టంట్ తో కాస్త హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ శుక్రవారం దిగబోయే సినిమాల లిస్ట్ లో.. తరుణ్ భాస్కర్ - సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన్న ఈ నగరానికి ఏమైంది, కన్నుల్లో నీ రూపమే, సంజీవిని, సూపర్ స్కెచ్, యుద్ధ భూమి, జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్ నటించిన శంభోశంకరా, నా లవ్ స్టోరీ సినిమాలు ఉన్నాయి.
ఈ నగరానికి ఏమైంది ఒక్కటే...
ఈ సినిమాలు అన్నింటిలో ఈ నగరానికి ఏమైంది సినిమా మీద మంచి బజ్ ఉంది. కారణం పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా పెద్ద నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కడంతో ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే ప్రేక్షకుల్లోనే పెద్దగా క్రేజ్ లేదు. ఎందుకంటే ఈ సినిమాలో అంతా కొత్త ముఖాలే. ఏదో తెలియని కన్ఫ్యూజన్. మరి ఈ సినిమా కోసం సురేష్ బాబు బాగానే థియేటర్స్ పట్టేసాడు. అందుకే ఈ సినిమా కి ఫర్వాలేదనిపించే బజ్ క్రియేట్ అయ్యింది. కానీ గుంపులో గోవిందంలా ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో శుక్రవారం తెలుస్తుంది.
శంభో శంకర కూడా...
ఇక సురేష్ కొండేటి శంభో శంకర సినిమాని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు. షకలక శంకర్ కి ఉన్న కామెడీ క్రేజ్ తో సినిమాకి బజ్ క్రియేట్ అయ్యి హిట్ అవుతుంది అంటే.. నమ్మేలెం. ఇక మిగతా సినిమాలన్నీ అసలెప్పుడు తెరకెక్కాయి అన్నది కూడా ప్రేక్షకులకి సమాచారం లేదు. మరి వచ్చే శుక్రవారం ఎన్ని సినిమాలు రేస్ లో ఉంటాయో మరెన్ని సినిమాలు డ్రాప్ అవుతాయో అనేది రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది.