Mon Dec 23 2024 08:01:09 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ శత జయంతి స్పెషల్ : ఎన్టీఆర్ సినీ ప్రస్థానం
నందమూరి తారకరామారావు మెట్రిక్యులేషన్ పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్ గా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నారు. కానీ అక్కడ..
తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి హీరోగా కొన్ని వందల సినిమాలు చేసి తెలుగు సినీ పరిశ్రమను ఏలి అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని సీఎంగా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించి ఎంతోమందికి దైవంలా నిలిచారు ఎన్టీఆర్. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఆయన్ని తలుచుకుంటూ, ఆయన విగ్రహాలు పెడుతూ స్మరించుకుంటున్నారంటే ఆయన సాధించిన విజయాలు, చేసిన మంచి అలాంటివి.
మే 28, 2023కు ఆయన జన్మించి 100 సంవత్సరాలు అవుతోంది. ఏడాదికాలంగా తెలుగు ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. స్వర్గీయ ఎన్టీఆర్ ను నేటికీ అందరూ గుర్తుంచుకునేలా చేసింది సినిమా రంగమే. సినిమా రంగంలో హీరోగానే కాకుండా రకరకాల పాత్రలతో మెప్పించి, రచయితగా, దర్శకుడిగా, ఎడిటర్ గా, నిర్మాతగా.. ఇలా సినిమాలకు తన జీవితాన్ని అంకితం ఇచ్చేశారు.
నందమూరి తారకరామారావు మెట్రిక్యులేషన్ పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్ గా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నారు. కానీ అక్కడ పనిచేయలేక, సినిమాల మీద మక్కువతో మద్రాస్ వచ్చేసారు. అప్పటికే ఎన్టీఆర్ గారికి బసవతారకం తో పెళ్లి కూడా అయిపోయింది. మొదట అవకాశాల కోసం తిరిగినా రాకపోవడంతో వెనక్కి వెళ్లిపోదామనుకున్నారు ఎన్టీఆర్. అదే టైంలో LV ప్రసాద్ గారి కళ్ళల్లో పడి మనదేశం సినిమాలో ఓ పాత్ర దక్కించుకున్నారు. ఎన్టీఆర్ మొదటి సినిమా మనదేశం. ఇందులో ఆయన ఓ పోలీస్ కానిస్టేబుల్ గా నటించారు. ఈ సినిమాలో V నాగయ్య హీరోగా చేశారు. అలా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్టీఆర్ తన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. మనదేశం సినిమా 1949లో వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ LV ప్రసాద్ ని మెప్పించడంతో ఆయన దర్శకత్వంలోనే ఎన్టీఆర్ హీరోగా సినిమాని అనౌన్స్ చేశారు.
1950లో LV ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మొదటి సినిమా షావుకారు సినిమా వచ్చింది. అదే సంవత్సరం పల్లెటూరి పిల్ల అనే సినిమాలోనూ నటించారు. 1951 లో KV రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళ భైరవి సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ హీరోగా సెటిల్ అయిపోయారు. అదే సంవత్సరం వచ్చిన మల్లీశ్వరి సినిమా కూడా పెద్ద హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ హీరోగా బిజీ అయిపోయారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ఎన్టీఆర్ కెరీర్ లో సాంఘికం, సామాజికం, కమర్షియల్, పౌరాణికం.. ఇలా అన్ని రకాల జోనర్స్ సినిమాలు తీసి మెప్పించారు.
ఎన్టీఆర్ కెరీర్ లో పెళ్లి చేసి చూడు, తోడు దొంగలు, అగ్గిరాముడు, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, పాండురంగ మహత్యం, సంపూర్ణ రామాయణం, బాల నాగమ్మ, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, గులేబకావలి కథ, గుండమ్మ కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధం, లవకుశ, బందిపోటు, నర్తన శాల, రాముడు భీముడు, స్రేకృష్ణ పాండవీయం, పల్నాటి యుద్ధం, పిడుగు రాముడు, ఉమ్మడి కుటుంబం, వరకట్నం, అలీబాబా 40 దొంగలు, బడిపంతులు, దేవుడు చేసిన మనుషులు, దానవీరశూరకర్ణ, అడవి రాముడు, సతి సావిత్రి, డ్రైవర్ రాముడు, సర్దార్ పాపారాయుడు, అగ్గిరవ్వ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి.. ఇలా అనేక సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు సృష్టించి టాప్ హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్ సినిమా అంటే జనాలు థియేటర్స్ కి పరిగెత్తుకొచ్చేలా అభిమానగణాన్ని సంపాదించుకున్నారు.
Next Story