ఓటమిలోనూ వ్యక్తిత్వాన్ని వదులుకోని నూతన్ నాయుడు
కామన్ మెన్ గా బిగ్ బాస్ లో అడుగుపెట్టి తన వ్యక్తిత్వంతో, మంచితనంతో లక్షలాది మంది మనస్సులో స్థానం సంపాదించుకున్న నూతన్ నాయుడు ఆదివారం బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అవుతూ కూడా తన వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని మరోసారి నిరూపించుకున్నారు. నూతన్ నాయుడు ఈ వారం ఎలిమినేషన్ గండం నుండి గట్టెక్కి ముందుకి వెళ్తాడని అందరూ ఆశించారు. కౌశల్ ఎలిమినేట్ అయ్యి నూతన్ గేమ్ లో కంటిన్యూ అవుతాడని భావించారు. కానీ అందరి ఆశల్ని, ఆలోచలని తలక్రిందులు చేస్తూ బిగ్ బాస్ నూతన్ నాయుడిని హౌస్ నుండి బయటకు పంపాడు. మొదటివారం కాస్త నెమ్మదిగా కనిపించినా రెండవ వారం తన ఎమోషన్ తో, వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకున్న నూతన్ ఇంకో రెండు మూడు వారాలు హౌస్ లో ఈజీగా కొనసాగుతాడు అని అందరూ అనుకున్నారు.
ఆకట్టుకున్న నూతన్ మనస్తత్వం...
ఆఖరి నిమిషం వరకూ కౌశల్ బయటకు వెళ్లిపోతాడని, నూతన్ నాయుడు సేవ్ అవుతాడని అందరూ భావించారు. కానీ శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో కిరీటి ప్రవర్తన వల్ల, మాటల వల్ల కన్నీటి పర్యంతం అయిన కౌశల్ ఊహించని రీతిలో చివరి క్షణాల్లో ప్రజల అభిమానాన్ని, ఓటింగ్ ని గెలుచుకోగలిగాడు. దీంతో ఎవరూ ఊహించని విధంగా ఓట్ల రేసులో వెనుకబడిన నూతన్ నాయుడు అనూహ్య పరిణామాల మధ్య బిగ్ బాస్ హౌస్ ని వీడాల్సి వచ్చింది. బిగ్ బాస్ లో కొనసాగడానికి కావలసిన అన్ని అర్హతలూ ఉన్నా, ఆఖరి నిమిషంలో ఓటింగ్ కారణాలతో బిగ్ బాస్ ని వీడిన నూతన్ హౌస్ మేట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కౌశల్, దీప్తి ఇద్దరూ ఆట విజయవంతంగా ఆడాలని మనస్పూర్తిగా కోరుకున్నాడు. తనని అడుగడుగునా టార్గెట్ చేసిన కిరీటి లాంటి వాళ్లని, తనని చిన్న చూపు చూస్తున్న బాబు గోగినేని కూడా నూతన్ పల్లెత్తు మాట అనలేదు. బిగ్ బాస్ తనకు ఇచ్చిన బిగ్ బాంబ్ ని తనకు శత్రువులుగా వ్యవహరించిన కిరీటి, తనిష్, తేజస్వి, బాబు గోగినేని మీద కాకుండా తనకు స్నేహితుడు గా ఉన్న కౌశల్ మీద ప్రయోగించి కౌశల్ కి ఈ బాంబ్ బాధ్యతను గుర్తుచేస్తుందని నాయుడు చెప్పిన మాటలు అందరితో చప్పట్లు కొట్టించాయి. హౌస్ లో నుండి బయటకు వెళుతూ కూడా అందరిలో పాజిటివ్ నెస్ నింపటానికి నూతన్ చేసిన ప్రయత్నాన్ని హోస్ట్ నాని మనస్ఫూర్తిగా అభినదించాడు. వేదిక మీద నూతన్ నాయుడిని ఆలింగనం చేసుకుని మరీ అభినందనలు తెలియజేశాడు. నూతన్ భవిష్యత్తుకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా..?
బిగ్ బాస్ లో ఏదైనా జరగొచ్చు అని అందరికీ తెలుసు. కానీ ఒక బలమైన పోటీదారుడు, సమర్ధత కలిగిన సామాన్యుడు ఇంత హఠాత్తుగా, ఇంత అనూహ్యంగా ఎలిమినేట్ కావడం వెనుక ఓటింగ్ కి మించిన కారణాలు ఏవో ఉన్నాయని సామాన్యులు అనుకుంటున్నారు. సమాధానం చెప్పాల్సింది, చెప్పగలిగేది ఒక్క బిగ్ బాస్ మాత్రమే.