Mon Dec 23 2024 10:15:21 GMT+0000 (Coordinated Universal Time)
"ఆదిపురుష్ బాలేదు" : చితక్కొట్టిన అభిమానులు
తాజాగా ఆదిపురుష్ చూసిన ఓ వ్యక్తి.. సినిమా ఏం బాగాలేదంటూ పలు యూట్యూబ్ ఛానళ్లకు రివ్యూ చెప్తుండగా ప్రభాస్ అభిమానులు..
ప్రపంచ వ్యాప్తంగా.. పలు భారతీయ ప్రధాన భాషల్లో ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ప్రీమియర్ షో లు పూర్తవడంతోనే రివ్యూ వచ్చేసింది. ఆదిపురుష్ సినిమా కొందరు బాగుందంటే.. మరికొందరు మాత్రం చిన్నపిల్లల బొమ్మల్లా చూపించారంటూ పెదవి విరుస్తున్నారు. బాహుబలిలో రాజులా కనిపించిన ప్రభాస్.. ఆదిపురుష్ లో రాముడి గెటప్ కు ఏమాత్రం సరిపోలేదని నిరాశ చెందారు.
తాజాగా ఆదిపురుష్ చూసిన ఓ వ్యక్తి.. సినిమా ఏం బాగాలేదంటూ పలు యూట్యూబ్ ఛానళ్లకు రివ్యూ చెప్తుండగా ప్రభాస్ అభిమానులు అతడిని ఐమ్యాక్స్ థియేటర్ వద్దే చితక్కొట్టారు. సినిమా ఏం బాలేదన్నాడు. ఆచార్యలో గ్రాఫిక్స్ మధ్య చిరంజీవిని ఎలా చూశామో ప్రభాస్ ను కూడా ఈ సినిమాలో అలానే చూపించారన్నాడు. ప్లే స్టేషన్లో కనిపించే రాక్షసుల్ని చూపించారు. హనుమంతుడు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ తప్ప మరేమీ బాలేదన్నాడు.
బాహుబలిలో రాయల్టీగా, రాజుగా ఉండే ప్రభాస్ ను తీసుకున్న ఓం రౌత్.. ఇక్కడ రాముడిగా రాజసం చూపించడంలో విఫలమయ్యాడన్నారు. ఇలా చెప్తుండగానే మధ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ అతడితో వాగ్వాదానికి దిగారు. ఏం చూసి సినిమా రివ్యూ చెప్తున్నావంటూ గొడవ చేశారు. మంచిగా చెప్తున్నాం.. ఇక్కడి నుండి వెళ్లిపో.. లేకపోతే తన్నులు తింటావ్ అని హెచ్చరించారు. ఇరువురి మధ్య మాటమాట పెరగడంతో.. ఆ వ్యక్తిపై దాడి చేశారు. ప్రభాస్ అభిమానులు చితక్కొట్టారు. అక్కడే ఉన్న మిగతా అభిమానులు, ప్రేక్షకులు ఆపడంతో గొడవ సద్దుమణిగింది.
Next Story